విజయవాడ : పాలిటెక్నిక్ విద్యార్ధులకు తక్షణ ఉపాధి చూపాలన్న ప్రభుత్వ ఆశయానికి
అనుగుణంగా చేపడుతున్న ప్రత్యేక జాబ్ మేళాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని
సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి అన్నారు. విజయవాడ ప్రభుత్వ
పాలిటెక్నిక్ కళాశాల నుండి వీల్స్ ఇండియా సంస్ధలో ఉద్యోగాలు పొందిన 261 మంది
విద్యార్ధులకు సోమవారం నాగరాణి నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా
కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నాగరాణి మాట్లాడుతూ క్యాంపస్
ప్లేస్ మెంట్స్ ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో
ఉన్నత స్ధానాలకు ఎదిగేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. పాలిటెక్నిక్
పూర్తి చేసిన వారెవ్వరూ నిరుద్యోగులుగా మిగలరాదన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు
సాంకేతిక విద్యా శాఖలో ఉపాధి కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు.
మూడు దశలలో విద్యార్ధులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు.
క్యాంపస్ ప్లేస్ మెంట్స్ కోసం కళాశాల యూనిట్ గా తొలిదశ, క్లస్టర్ స్ధాయిలో
మలిదశ, రాష్ట్ర స్ధాయిలో తుదిదశ విభాగాలు పనిచేస్తున్నాయని నాగరాణి తెలిపారు.
అయా సంస్ధలు, విద్యార్ధుల మధ్య సమన్వయం కోసం అనుభవం ఉన్న అధికారులకు బాధ్యతలు
అప్పగించామన్నారు. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో జరిగిన క్యాంపస్
ప్లేస్‌మెంట్స్ లో మొత్తం 335 మంది చివరి సంవత్సరం విద్యార్థులు హాజరు కాగా,
261 మంది విద్యార్ధులు 2.32 లక్షల సాంవత్సరిక వేతనంతో ఎంపికయ్యారన్నారు.
వీరిలో 236 మంది విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ నుండి, 25 మంది సమీపంలోని
ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల నుండి ఉన్నారన్నారు. మెకానికల్, ఆటోమొబైల్,
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెటలర్జీ బ్రాంచ్‌ల నుండి వీరు ఎంపిక
అయ్యారన్నారు. కార్యక్రమంలో ట్రైనింగ్ ప్లేస్మెంట్ డిప్యూటీ డైరెక్టర్
డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ, వీల్స్ ఇండియా మానవవనరుల విభాగం నుండి దివాకర్,
పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం విజయ సారధి, ఉఫాధి అధికారి
డాక్టర్ కె విజయ భాస్కర్, సిబ్బంది, విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.
వీల్స్ ఇండియాతో పాటు ప్రతిష్టాత్మక టాటా ప్రాజెక్ట్స్ కు మరో 11 మంది ఎంపిక
కాగా వారికి కూడా కమీషనర్ నియామక పత్రాలు పంపిణీ చేసారు.
హెచ్ఎల్ మండో ఆనంద్ ఇండియాలో 19 మందికి అవకాశం:
మరోవైపు హెచ్ఎల్ మండో ఆనంద్ ఇండియాలో 19 మందికి అవకాశం లభించింది. ఉత్తీర్ణత
సాధించిన డిప్లొమా విద్యార్థులు ఈ సంస్దలో టెక్నీషియన్ అప్రెంటీస్లుగా
ఎంపికకాగా, ఒంగోలు డిఎ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఇటీవల సాంకేతిక విద్యా శాఖ
నిర్వహించిన జాబ్ మేళాలో ఈ ఎంపికలు జరిగాయి.