ఏడాదిన్నర తర్వాత స్వదేశానికి
కొద్ది కాలంగా కనిపించకుండా పోయిన ఆసియా కుబేరుడు, అలీబాబా సంస్థల
వ్యవస్థాపకుడు జాక్ మా చైనాలో అడుగుపెట్టాడు. ఆయన ఓ పాఠశాలలో
ప్రత్యక్షమయ్యారు. విద్యార్థులతో ఆప్యాయంగా కాసేపు ముచ్చటించారు. చైనా పాలక
వర్గాన్ని విమర్శించి ప్రభుత్వ ఆగ్రహానికి గురైన అలీబాబా సంస్థల అధినేత, ఆసియా
కుబేరుడు జాక్మా చాలా రోజుల తర్వాత స్వదేశంలో అడుగు పెట్టారు. 2021లో
దేశాన్ని వీడిన జాక్మా ఆ తర్వాత ఇప్పుడే తొలిసారిగా చైనాలో అడుగుపెట్టారు.
సోమవారం తూర్పు చైనాలోని హాంగ్జౌలో ఉన్న యుంగు పాఠశాలను జాక్ మా
సందర్శించారు. ఆయన స్థాపించిన విద్యాసంస్థకు వెళ్లి విద్యార్థులతో కాసేపు
ముచ్చటించారు. విద్యార్థులతో ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్, చాట్ జీపీటీ గురించి
మాట్లాడినట్లు తెలిసింది. నేర్చుకోవడం పట్ల తనకున్న ఆసక్తులను విద్యార్థులతో
పంచుకున్నట్లు సమాచారం.
ప్రభుత్వంపై విమర్శలతో చిక్కుల్లో పడ్డ జాక్ మా
2020లో ప్రభుత్వ విధానాలను విమర్శించింనందుకు చిక్కుల్లో పడ్డ జాక్మా చాలా
రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ప్రభుత్వాన్ని విమర్శలు చేసిందుకుగాను చైనా
దర్యాప్తు సంస్థలు జాక్మాను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆర్థిక బలాన్ని
విపరీతంగా దెబ్బకొట్టాయి. ఆ తర్వాత జాక్ కొన్ని రోజుల వరకు ఎవరికీ
కనిపించకుండా పోయారు. కమ్యూనిస్ట్ పార్టీని విమర్శించిన పలువురు చైనా
ప్రముఖులు వరసగా అదృశ్యం కావడం వల్ల జాక్మాను కూడా ప్రభుత్వమే కిడ్నాప్ చేసి
ఉండొచ్చని ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ ఇప్పుడు చైనాలో అడుగు పెట్టడం వల్ల
ఆ ఊహాగానాలకు తెరపడింది.చైనా ప్రభుత్వం కొద్దికాలంగా సాంకేతికత, విద్య,
ఆన్లైన్ గేమింగ్, ఫైనాన్షియల్ కంపెనీలపై ఆంక్షలు విధిస్తోంది. దీంతో ప్రైవేటు
రంగం కాస్త కుదేలైంది. కొవిడ్-19 ప్రభావం, ప్రభుత్వ కఠినమైన నిబంధనలతో ఆర్థిక
వ్యవస్థను మందగించింది. దీంతో చైనా ప్రభుత్వం ప్రైవేట్ రంగంపై విశ్వాసాన్ని
పెంచడానికి ప్రయత్నిస్తోంది.
ఈ నెల ప్రారంభంలో చైనాకు కొత్తగా నియామకం అయిన ప్రధాన మంత్రి లీ కియాంగ్ కీలక
వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ రంగానికి ప్రభుత్వం మద్దతునిస్తుందని ఆయన అన్నారు.
ప్రైవేటు సంస్థల వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చేందుకు లీ కియాంగ్
ప్రయత్నించారు. ప్రధానమంత్రి లీ కియాంగ్ వ్యాఖ్యలు ఈ నేపథ్యంలోనే జాక్ మా
చైనాకు తిరిగి వచ్చారని పలు ఉహాగానాలు వెలువడుతున్నాయి.
జాక్ మా ఒకప్పుడు సమావేశాలు, పర్యటనలు, ప్రసంగాలతో తీరికలేకుండా గడిపేవారు.
నిత్యం ఏదో ఒక అప్డేట్తో వార్తల్లో నిలిచేవారు. కానీ, గత కొంతకాలంగా
పూర్తిగా కనుమరుగైపోయారు. ఎక్కడా ఆయన గురించి చిన్న వార్త కూడా బయటకు రాలేదు.
టెక్ వ్యాపారాలు, వాటి యజమానులపై చైనా విరుచుకుపడడం ప్రారంభించినప్పటి నుంచి
జాక్ మా జాడ లేకుండా పోయింది. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉంటున్నారనేది చాలా మందికి
ఓ అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. ప్రస్తుతం స్వదేశంలో అడుగుపెట్టిన జాక్
మా తరువాతి కార్యాచరణ సృష్టత రావాల్సి ఉంది.