క్రమశిక్షణ తప్పితే సస్పెన్షన్ తప్పదు
నరసన్నపేట : శాసనసభ్యుల కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో ప్రత్యర్ధులతో చేతులు కలిపి
సొంతపార్టీ అభ్యర్ధిని ఓడించిన ఎమ్మెల్యేలను వైఎస్సార్సీపీ నుంచి బహిష్కరించడం
సమంజసమేనని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన మంగళవారం ఒక
ప్రకటన విడుదల చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉంటూ ఆనం
రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి,
ఉండవల్లి శ్రీదేవిలు పార్టీ నిర్దేశించిన ఎంఎల్సీ అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటు
వేసినట్టు నిర్ధారించుకున్న తర్వాతే అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి, పార్టీ
క్రమశిక్షణ కమిటీ వారిపై సస్పెన్షన్ వేటు వేసిందన్నారు . పార్టీ వ్యతిరేక
కార్యకలాపాలకు పాల్పడిన ఆ నలుగురు ఎమ్మేల్యేలు రాజీనామా చేసి వారికి నచ్చిన
పార్టీ నుంచి పోటీ చేస్తే ఎవరి బలం ఏంటో తేలిపోతుందని చెప్పారు. ఒక్క
ఎమ్మెల్సీ సీటుతో టీడీపీ అతిగా ఊహించుకుంటోందని మండిపడ్డారు. కోవిడ్ సమయంలో
ఉండవల్లి శ్రీదేవి తీవ్ర అస్వస్థతకు గురైతే స్పెషల్ ఫ్లైట్ పెట్టి సీఎం జగన్
ఆమె ప్రాణాలు కాపాడారని, ఈరోజు ఆయన నుండే ప్రాణహాని ఉందని శ్రీదేవి, చంద్రబాబు
స్క్రిప్ట్ చదువుతున్నారన్నారు.
ఎంఎల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఈ నలుగురు వ్యవహరిస్తున్న తీరే వారు
వెన్నుపోటుకు పాల్పడినట్టు స్పష్టం చేస్తోందని అన్నారు. ఎంతో రాజకీయ
అనుభవంగలిగిన ఆనం రామనారాయణరెడ్డి కూడా చంద్రబాబు ఉచ్చులో పడి, ప్రలోభాలను
నమ్మి వైఎస్సార్సీపీకి ద్రోహం చేయడానికి ప్రయత్నించటం బాధాకరమన్నారు. పార్టీ
ఈ నలుగుర్నీ సస్పెండ్ చేస్తే వీరు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామ
కృష్ణారెడ్డిపై పలు ఆరోపణలు చేస్తూ మీడియాలో హడావిడి చేస్తున్నారన్నారు.
ఎవరైనా సరే పార్టీ నిర్దేశించిన క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందేనని
కృష్ణదాస్ స్పష్టం చేశారు. రెండవ ప్రాధాన్యత ఓటుతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ
ఎన్నికల్లో గెలిచి ఆ పార్టీ తెగ హడావిడి చేస్తుందని, సాధారణ ఎన్నికలకు మొన్న
జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎంతో తేడా ఉంటుందని అన్నారు. పార్టీ అధికారంలోకి
వచ్చిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ 98% విజయాలతో వైయస్ఆర్సీపీ రికార్డ్
సృష్టించిందని గుర్తు చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి
మరోసారి సీఎం కావడం ఖాయమని అన్నారు.