పాటియాలా జైల్లో ఏడాది జైలు శిక్షను అనుభవిస్తున్న సిద్దూ
సత్ప్రవర్తన కారణంగా 48 రోజుల శిక్ష తగ్గింపు
మధ్యాహ్నం జైలు వెలుపల మీడియాతో మాట్లాడనున్న సిద్దూ
పంజాబ్ కాంగ్రెస్ నేత, టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ఈరోజు
జైలు నుంచి విడుదల కాబోతున్నారు. రోడ్డు పక్కనున్న వ్యక్తితో గొడవ కారణంగా
జరిగిన దాడిలో సదరు వ్యక్తి చనిపోయిన కేసులో సిద్దూకి కోర్టు జైలు శిక్ష
విధించింది. కోర్టు తీర్పు మేరకు పాటియాలా కోర్టులో ఆయన 10 నెలల జైలు శిక్షను
అనుభవించారు. 34 ఏళ్ల క్రితం ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. మరోవైపు జైలు నుంచి
సిద్దూ విడుదలవుతున్న తరుణంలో ఆయన అఫీషియర్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ప్రకటన
వెలువడింది. మధ్యాహ్నం జైలు నుంచి విడుదలైన తర్వాత పాటియాలా జైలు ఎదుట సిద్దూ
మీడియాతో మాట్లాడతారని ఆ ప్రకటనలో తెలియజేశారు. ఈ కేసులో వాస్తవానికి సిద్దూకి
ఏడాది జైలు శిక్షను కోర్టు విధించింది. దీని ప్రకారం ఆయన మే నెలలో విడుదల
కావాల్సి ఉంది. అయితే, జైల్లో ఆయన సత్ప్రవర్తన కారణంగా ముందుగానే 10 నెలల్లోనే
విడుదలవుతున్నారు. ఆయనకు 48 రోజుల శిక్షాకాలం తగ్గింది. మరోవైపు జైలు నుంచి
సిద్దూ విడుదల కానున్న నేపథ్యంలో ఆయన అభిమానులు జైలు వద్ద సందడి చేసేందుకు
సిద్ధమవుతున్నారు.