ఊపనుంది. కేంద్ర ప్రభుత్వం తుది పరిశీలనలో సుమారు రూ.40 వేల కోట్ల పనులు
ఉన్నాయి. వీటికి సంబంధించి పెండింగ్లో ఉన్న భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలని
రాష్ట్రానికి సూచనలు చేసింది.తెలంగాణలో మరిన్ని జాతీయ రహదారుల విస్తరణకు రంగం సిద్ధం అవుతోంది. వచ్చే
ఆర్థిక సంవత్సరానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలో
సుమారు రూ.40 వేల కోట్ల మేర రహదారి విస్తరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు
ఉన్నాయి. కేంద్రం చేపడుతున్న భారత్ మాల-2 పథకం కింద రూ.25 వేల కోట్లు,
ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద మరో రూ.15 వేల కోట్ల విలువ చేసే పనులు ఇందులో
ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 1,575 కిలోమీటర్ల మేర రహదారుల విస్తరణకు
సంబంధించి తెలంగాణ నుంచి వెళ్లిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ పరిశీలన తుది
జాబితాలో చేరినట్లు సమాచారం. ఇందులో 1000 కిలోమీటర్ల మేర పనులను మంజూరు చేసే
అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
భారత్మాల-2లో ప్రాంతీయ రింగ్ రోడ్డు రెండో దశ
ఆర్ఆర్ఆర్ మొదటి దశ భూ సేకరణ నిధుల విడుదల పీటముడి వీడనప్పటికీ.. రెండో
దశను భారత్ మాల-2లో చేర్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దాదాపు 187 కిలో
మీటర్ల మేర ప్రాంతీయ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని ఆ పథకం కింద మంజూరు
చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. తుది జాబితాలో
చేర్చినప్పటికీ ఉత్తర భాగంలో భూ సేకరణకు తెలంగాణ ప్రభుత్వం తన వాటా నిధులను
విడుదల చేశాకే దక్షిణ భాగానికి అనుమతి ఇవ్వడంతో పాటు సవివర నివేదికకు ఆమోద
ముద్ర వేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. మరో నాలుగు
మార్గాలను ఈ పథకంలో చేర్చాలన్న ప్రతిపాదనలకు త్వరలో ఆమోదం లభించనున్నట్లు
తెలుస్తోంది.
అసలు చిక్కులు భూ సేకరణతోనే
అయితే ఈ జాతీయ రహదారుల విస్తరణకు భూ సేకరణ ఆటంకంగా మారినట్లు కేంద్ర రవాణా,
జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దృష్టికి వెళ్లింది. గత నాలుగైదేళ్ల వ్యవధిలో
తెలంగాణకు మంజూరు చేసిన 11 జాతీయ రహదారులకు సంబంధించిన భూ సేకరణ నత్తనడకన
సాగుతోంది. అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో రాజకీయ ఒత్తిళ్లతో పాటు ప్రజల నుంచి
వస్తున్న వ్యతిరేకత దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. దాదాపు 4,332 హెక్టార్ల
మేరకు భూసేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటికీ కేవలం 284 కిలోమీటర్ల భూమిని
సేకరించినట్లు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇటీవల సీఎం కేసీఆర్కు లేఖ రాసిన
విషయం తెలిసిందే.