అమరావతి : నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గుంటూరు, కృష్ణా,
ఎన్టీఆర్ జిల్లాల పేదల కల నెరవేరనుంది. ఇళ్లు లేనివారికి అమరావతిలో ఇళ్లు
పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన 33వ
సీఆర్డీఏ అధారిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు సమావేశంలో ఆమోద ముద్ర
పడింది. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడో విడతలో భాగంగా వీరికి
ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు.
లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్లు తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల
కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రతిపాదనలు సీఆర్డీఏకు అప్పగించాలని
ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను
వెంటనే కల్పించేలా తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎం జగన్ సూచించారు.
మేనెల మొదటివారం నాటికి.. పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని
అధికారులను ఆదేశించారు. ఇళ్లులేని పేదల చిరకాల వాంఛ నెరవేర్చే ఈ
కార్యక్రమాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం జగన్ పేర్కొన్నారు.
న్యాయపరమైన చిక్కులు వీడిన తర్వాత పేదలకు ఇళ్ల పట్టాలు దక్కనున్నాయి.
అమరావతితో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కోసం ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ జీవో
జారీ చేశారు. దీనిలో భాగంగా అమరావతిలో 1134.58 ఎకరాల భూమి పేదల ఇళ్లకోసం
కేటాయించారు. మొత్తం 20 లే అవుట్లలో స్థలాలు కేటాయింపు జరుగనుంది. గుంటూరు,
కృష్ణా జిల్లాలకు చెందిన 48, 218 మందికి ఇళ్ల పట్టాలు కేటాయించనున్నారు.
ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కూరగల్లు, నిడమనూరు ప్రాంతాల్లో ఇళ్ల
స్థలాలు ఇవ్వనున్నారు.