విజయవాడ : రబీలో ధాన్య సేకరణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని రాష్ట్ర
పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అటు అధికార యంత్రాంగానికి,
ఇటు మిల్లర్లకు స్పష్టం చేశారు. మరో వారం రోజుల్లో ధాన్యం కొనుగోలుకు
సిద్దమవుతోందని, దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి
చేయాలని మంత్రి కారుమూరి ఆదేశించారు. రెండు రోజులుగా పౌరసరఫరాల శాఖ
ఉన్నతాధికారులు, మిల్లర్లతో మంత్రి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఖరీఫ్
అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రబీకి యంత్రాంగం మొత్తం సిద్దంగా ఉండాలని
స్పష్టం చేశారు. ఏ రైతు తన ధాన్యం కొనుగోలు చేయలేదని కానీ, కనీస మద్దతు ధర
లభించ లేదని కానీ ఆరోపణలు చేసే అవకాశం ఉండకూడదని మంత్రి అన్నారు.
దళారులకు అవకాశం లేకుండా ఆర్బీకెల ద్వారా ప్రయోగాత్మకంగా ప్రభుత్వం ఖరీఫ్ లో
చేపట్టిన ధాన్య సేకరణ పద్దతి సత్ఫలితాలు ఇచ్చిందన్నారు… రబీలో మరింత మెరుగైన
చర్యలు చేపట్టి ఎక్కడా అవకతవకలు జరగకుండా చూడాలని కోరారు. మిల్లర్లకు అవసరమైన
గన్ని బ్యాగులను సకాలంలో సరఫరా చేస్తామని.. అలాగే బ్యాంక్ గ్యారంటీ విషయం లోనూ
వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు.అయితే బియ్యం దారి మళ్లింపు, ధాన్య
సేకరణ లో జోక్యం చేసుకోవడం వంటివి సహించేది లేదని మిల్లర్లను మంత్రి
హెచ్చరించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, సంస్థ ఎండీ
వీరపాండ్యన్, డైరెక్టర్ విజయ సునీత లతో పాటు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి
జిల్లాల రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.