బ్రిటన్ మాజీ ప్రధాని లిజ్ ట్రస్ ఫోన్ హ్యాకింగుకు గురైందంటూ ‘ది మెయిల్’ పత్రిక ప్రచురించిన కథనం కలకలం సృష్టిస్తోంది.
లండన్: బ్రిటన్ మాజీ ప్రధాని లిజ్ ట్రస్ ఫోన్ హ్యాకింగుకు గురైందంటూ ‘ది మెయిల్’ పత్రిక ప్రచురించిన కథనం కలకలం సృష్టిస్తోంది. విదేశాంగ మంత్రిగా ట్రస్ బాధ్యతలు నెరవేరుస్తున్న సమయంలో ఆమె ఫోన్‌కాల్స్‌ను రష్యన్ ఏజెంట్లు రికార్డు చేసినట్లు పత్రిక తన కథనంలో పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా ట్రస్.. ఐరోపా, ఇతర మిత్రదేశాలతో మాట్లాడిన సునిశిత సమాచారం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిందని.. ఇందులో మాజీ ఆర్థిక మంత్రి క్వాసీ కార్టెంగ్తో ఆమె జరిపిన ప్రైవేటు సంభాషణలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ట్రస్.. టోరీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సమయంలో ఈ హ్యాకింగ్ విషయం బయటపడినా నాటి ప్రధాని బోరిస్ జాన్సన్ రహస్యంగా ఉంచారని పత్రిక పేర్కొంది.