ఫ్లయిట్‌ను వెనక్కి తిప్పిన పైలట్
న్యూఢిల్లీ : సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా
విమానంలో ఓ ప్రయాణికుడు రచ్చ రచ్చ చేశాడు. ఫ్లయిట్ గాల్లో ఉండగా సిబ్బందితో
గొడవకు దిగాడు. వాళ్లతో ఫైట్ చేశాడు. దీంతో వెంటనే విమానాన్ని వెనక్కి
మళ్లించాడు పైలట్. తిరిగి ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో
ల్యాండ్ చేశాడు. అనంతరం సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి ప్రయాణానికి అంతరాయం
కల్గించిన ప్యాసింజర్‌ను కిందకు దింపేశారు. అతనిపై ఫిర్యాదు చేసి
విమానాశ్రయంలోని పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత విమానం మళ్లీ లండన్
బయల్దేరి వెళ్లింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ ఇండియా నిర్వాహకులు
అధికారకంగా స్పందించాల్సి ఉంది. ప్యాసింజర్ సిబ్బందితో ఎందుకు గొడవపడ్డాడనే
విషయం తెలియాల్సి ఉంది. కాగా ఇటీవలి కాలంలో కొందరు ప్రయాణికులు విమానాల్లో
అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఓ ప్యాసింజర్ తప్పతాగి
తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం లేపిన విషయం
తెలిసిందే. ఆ తర్వాత మరో ఘటనలో ఓ ప్యాసింజర్ విమానంలో స్మోకింగ్ చేసి హల్ చల్
చేశాడు. మరో ఘటనలో మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు తోటి ప్యాసింజర్లతో గొడవకు
దిగి నానా హంగామా చేశాడు.