విజయవాడ : జన గణనలో కుల గణన చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
బీసీ కులగణనకు కార్యాచరణ స్టడీ కమిటీ వేయటం ముదావహం అని ఆంధ్రప్రదేశ్
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన
శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల
సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత సామాజిక విప్లవోద్యమ పిత మహాత్మా జ్యోతిబా పూలే
197వ రాష్ట్ర స్థాయి జయంతి మహోత్సవ వేడుకలను విజయవాడలోని తుమ్మలపల్లి వారి
క్షేత్రయ్య కళాక్షేత్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిబా పూలే
జయంతి వేడుకల్లో భాగంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు కళాక్షేత్రం
వద్ద ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం
కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన పూలే విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన
చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పూలే జయంతి వేడుకల సభకు సభాధ్యక్షులుగా విజయవాడ
సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ వ్యవరించారు. ఈ సందర్భంగా ముఖ్య
అతిథిగా హజరైన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి
చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలు 139
కులాలు ఉన్నా వారి సంఖ్య తెలియని పరిస్థితి నెలకొని ఉందని, బీసీ సంఘాల
ఆభ్యర్ధన మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జనగణనలో బీసీ కులగణన చేయాలని
సంకల్పించి బీసీ మంత్రిగా ఆ బాధ్యతను నాపై ఉంచారని, బీసీ కులగణనకు అవసరమైన
కార్యాచరణ స్టడీ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. స్టడీ కమిటీ సభ్యులు కులగణన
చేపడుతున్న ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి అధ్యయనం చేస్తారన్నారు. బీసీలు
వెన్నెముకగా నిలవాలన్న ఆలోచన చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి బీసీలకు కారణ
జన్ముడని కొనియాడారు. పుట్టిన వారు సంఘంలో పేరు ప్రఖ్యాతలు సాధించాలంటే విద్య
ఒక ఆయుధం అని, ప్రతి ఒక్కరికి విద్య అందాలని కడుపులో బిడ్డ నుంచి ఉన్నత చదువుల
వరకు యువతకు వివిద దశల్లో అనేక పథకాలతో జగనన్న అండగా నిలుస్తున్నాడని, అమ్మ
ఒడి నుంచి విదేశీ విద్యాదీవెన వరకు పేద వారి చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక
ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని అన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి
2017లో ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం బడుగు, బలహీన వర్గాలు ఉన్నత
చదువులు అంది పుచ్చుకోవటానికి కారణమైందన్నారు. గత ప్రభుత్వాలు కేవలం ఎన్నికల
హామీల వరకే బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతిపై మాట్లాడే వారని, కేవలం మహానేత
మాత్రమే చేతల ద్వారా చూపించాడని కొనియాడారు.