బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనలేని కృషి
జ్యోతిబా ఫూలే, అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జర్నలిస్టులకు ప్రభుత్వ
చిరు సత్కారం
ఏపీ ప్రెస్ అకాడమీ జర్నలిజం డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు గడువు
పెంపు
సి.ఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు
విజయవాడ : బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనలేని
కృషి చేస్తోందని సి ఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మనేని
శ్రీనివాసరావు అన్నారు. మహాత్మా జ్యోతిబాఫూలే, బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్
జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం, ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో
విజయవాడ ఎం.జి.రోడ్డులోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో మీడియా రంగంలో విశేష కృషి
చేసిన జర్నలిస్టులకు, ఉద్యోగులకు గురువారం సత్కార కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ జ్యోతిబాఫూలే, అంబేద్కర్
జయంతి పురస్కరించుకుని జర్నలిస్టులను సన్మానించడం సంతోషంగా ఉందన్నారు.
అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన, మహిళోద్ధరణకు జ్యోతిబా ఫూలే
పాటుపడ్డారన్నారు. అటువంటి జ్యోతిబా ఫూలేను గురువుగా భావించిన డా.బి.ఆర్
అంబేద్కర్ కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచారన్నారు. దుర్భర పరిస్థితులను
ఎదుర్కొని విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన అంబేద్కర్ ఒక పెద్ద నడిచే
గ్రంథాలయమని కీర్తించారు. దేశ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ కు ఉన్నటువంటి
విగ్రహాలు దేశంలో మరెవ్వరికీ లేవన్నారు. సి.ఆర్. ప్రెస్ అకాడమీ చైర్మన్ గా
పదవీ బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుంచి జర్నలిస్టుల సంక్షేమానికి, సమస్యల
పరిష్కారానికి వినూత్న కార్యక్రమాలు చేపట్టామన్నారు. అందులో భాగంగానే ఈరోజు
రాష్ట్ర ప్రభుత్వం, సి.ఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో
జర్నలిస్టులను సన్మానించడం జరిగిందన్నారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డుల
విషయంలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం పొందేందుకు ప్రత్యేక చర్యలు
చేపట్టామన్నారు. ఈ మేరకు వివిధ సమస్యల్ని పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు
తమదృష్టికి తేవడం జరిగిందని వాటిని సంబంధిత అధికారులతో చర్చించి
పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. మున్ముందు కూడా జర్నలిస్టుల
సంక్షేమానికి ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.
రాష్ట్ర గ్రంథాయల సంస్థ ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ జర్నలిస్టుల
ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా సత్కార కార్యక్రమం స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం
చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. నిజాన్ని నిర్భయంగా చెబుతూ సమాజాభ్యుదయం కోసం
పాటుపడుతున్న జర్నలిస్టుల కోసం ఆలోచన చేయడం మంచి పరిణామమన్నారు. పేద పిల్లలకు
కూడా కార్పొరేట్ విద్యను అందిస్తూ, సంక్షేమాన్ని సైతం క్షేత్రస్థాయికి
తీసుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ట్రెడిషినల్
గ్రంథాలయాలను డిజిటల్ గ్రంథాలయ వ్యవస్థగా మార్చి భావితరాలకు దిక్సూచిగా
మార్చిన ముఖ్యమంత్రి నిర్ణయం అద్భుతమన్నారు.
ఏపీ ఎన్ఆర్టీఎస్ ఛైర్మన్ మేడపాటి వెంకట్ మాట్లాడుతూ నేడు సోషల్ మీడియా ప్రభావం
ఎక్కువగా ఉన్నా కూడా జర్నలిస్టుల ద్వారా ప్రజలకు అందే సమాచారంపై ఎక్కువ
ఇంపాక్ట్ ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం ద్వారా
దేశంలోనే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ 16 శాతంగా ఉందన్నారు. ఏపీ ఎన్ఆర్టీఎస్
ద్వారా విదేశాల్లో ఉన్న తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడతున్నామని
అక్కడ వారు ఎదుర్కొనే సమస్యలపై పూర్తి అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎస్.వెంకటరావు
మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావుకు
జర్నలిస్టుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. హెల్త్ కార్డులకు సంబంధించిన
సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లగానే సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలను
పరిష్కరించారన్నారు. నేడు సన్మానం పొందుతున్న జర్నలిస్టులకు అభినందనలు
తెలుపుతున్నానని జ్యోతిబా పూలే, అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర
ప్రభుత్వం, ప్రెస్ అకాడమీ సంయుక్తంగా ఇటువంటి కార్యక్రమం చేపట్టడం ఆనందంగా
ఉందన్నారు.
వైఎస్సార్ మేధావుల ఫోరంజి.శాంతమూర్తి ఛైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వానికి,
ప్రజలకు మధ్య వారథిగా ఉన్న జర్నలిస్టుల సేవలను గుర్తించి సత్కరించడం గర్వంగా
ఉందన్నారు. డిజిటల్ విద్య వచ్చిన తర్వాత పిల్లలో పుస్తక పఠనంపై ఆసక్తి
పోయిందని దీనిపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
నిమ్మరాజు చలపతిరావు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర
ప్రభుత్వం, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలకు
వెంటనే పరిష్కారం లభిస్తుండటం సంతోషంగా ఉందన్నారు.
అనంతరం మీడియా రంగంలో విశేష సేవలు అందించిన 11 మంది జర్నలిస్టులకు, రిటైర్డ్
ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం, సి.ఆర్.ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో
మెమెంటో, శాలువాతో ఘనంగా సత్కరించారు. సన్మానం నం అందుకున్న వారిలో శాసపు
జోగినాయుడు, ఎ. యుగంధర్, బడుగు కోటేశ్వరరావు, అవ్వారు గోవిందరాజులు, యేమినేని
వెంకటరమణ, అవ్వారు శ్రీనివాసరావు, షేక్ రాజా సాహెబ్, జి.విజయకుమార్, పి.బి.బి.
విజయ్ చంద్రన్, ఎం.ఫ్రాన్సిస్, కంచర్ల జయరావు ఉన్నారు.
ముందుగా మహాత్మా జ్యోతిబా ఫూలే, డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు
వేసి అతిథులు నివాళులర్పించారు. ప్రెస్ అకాడమి మాజీ ఛైర్మన్ దేవిరెడ్డి
శ్రీనాథరెడ్డి మృతిపట్ల 2 నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో
సి.ఆర్.ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి సెక్రటరీ మామిడిపల్లి బాల గంగాధర తిలక్,
ఓఎస్డీ జీవన్ తదితరులు పాల్గొన్నారు.