తొమ్మిదేళ్ల తర్వాత విగ్రహం ఏర్పాటు చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ప్రాణహిత-చేవెళ్లకు అంబేడ్కర్ పేరు ఎందుకు తొలగించారో చెప్పాలని డిమాండ్
చేశారు. మంచిర్యాలలో కాంగ్రెస్ నిర్వహించిన జై భారత్ సత్యాగ్రహ సభలో ఆయన
మాట్లాడారు. ఈ కార్యక్రమాని ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన
ఖర్గే హాజరయ్యారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఇవాళ ఘనంగా ముగించారు. మార్చి 16వ తేదీ నుంచి సుమారు
నెల రోజులు పాటు కొనసాగిన ఈ యాత్ర ఇవాళ ముగిసింది. అనంతరం ఆ పార్టీ మంచిర్యాల
ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో
పాటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాట్లాడారు.
కార్యక్రమంలో మాట్లాడిన సీఎల్సీ నేత భట్టి విక్రమార్క దేశంలో ప్రజాస్వామ్యం
కాపాడేది కాంగ్రెస్ పార్టీనేనని కొనియాడారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ.. పేదల
గురించి మాట్లాడుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇబ్బంది పడ్డారని ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పోడు భూముల పట్టాలు పంపిణీ
చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్
జిల్లాలో సాగు నీరు అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 2023లో అధికారంలోకి
వచ్చేది కాంగ్రెస్ పార్టీనేనని విశ్వాసం వ్యక్తం చేశారు. ఖర్గే సూచన మేరకు
తెలంగాణలో తాను, రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినట్లు చెప్పుకొచ్చారు.
మంచిర్యాల గడ్డ.. కాంగ్రెస్ పార్టీకి అడ్డా
అనంతరం మాట్లాడిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’
దిగ్విజయంగా జరుగుతోందని తెలిపారు. మంచిర్యాల గడ్డ.. కాంగ్రెస్ పార్టీకి
అడ్డా అని ఆయన అభివర్ణించారు. తాను పీసీసీ అధ్యక్షుడుగా భాద్యత స్వీకరించిన
తరువాత నిర్మల్‌లో మహాధర్నా చేపట్టినట్లు గుర్తుచేసుకున్నారు. 2024లో
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్
అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటామని ప్రకటించారు.
అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై గొప్పగా చెప్పుకుంటున్నారని ఆరోపించిన
రేవంత్‌రెడ్డి.. ప్రకటించిన తొమ్మిదేళ్ల తర్వాత అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు
చేశారని మండిపడ్డారు. ప్రాణహిత-చేవెళ్లకు అంబేడ్కర్ పేరు ఎందుకు తొలగించారో
చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ ద్వారా
రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. రూ.500కే సిలిండర్ ఇచ్చే
బాధ్యత తీసుకుంటామని ప్రకటించారు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు.
“ఇసుక దోపిడీకి అడ్డువచ్చిన వారిని లారీలతో తొక్కించారు. నాడు దళిత మంత్రిని
బర్తరఫ్ చేశారు. మీ బిడ్డపై కుంభకోణాలు బయటపడుతుంటే పదవుల నుంచి తొలగించలేదు.
అవినీతి ఆరోపణలు వస్తే కుమారుడైనా, కుమార్తైనా తొలగిస్తామన్నారు. అవినీతి
ఆరోపణలు వచ్చినా ఎందుకు తొలగించట్లేదో చెప్పాలి. పేదలకు కార్పొరేట్ వైద్యం
అందుబాటులోకి తెస్తే నిర్వీర్యం చేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
అన్నారు.