స్వీయ పరిజ్ఞానంతో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో) ఆ దిశగా ప్రణాళికలు రచిస్తోంది.
దిల్లీ: స్వీయ పరిజ్ఞానంతో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో) ఆ దిశగా ప్రణాళికలు రచిస్తోంది. భూకక్ష్యలోకి భారీ సామగ్రిని తరలించే సామర్థ్యమున్న పునర్వినియోగ రాకెట్ అభివృద్ధి కోసం తమతో చేతులు కలపాలని ప్రైవేటు పరిశ్రమలను కోరింది. ‘‘కొత్తతరం వాహక నౌక (ఎన్జీఎల్వీ)గా పిలిచే ఈ రాకెట్‌కు రూపకల్పన చేస్తున్నాం. దీని అభివృద్ధిలో భాగస్వామ్యం వహించాలని పరిశ్రమలను ఆహ్వానిస్తున్నాం. ప్రాజెక్టుకు అవసరమైన పెట్టుబడిని సమకూర్చాలని వారినీ కోరుతున్నాం’’ అని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ పేర్కొన్నారు.
భూస్థిర బదిలీ కక్ష్యలోకి 10 టన్నులు లేదా దిగువ భూకక్ష్యలోకి 20 టన్నుల బరువును మోసుకెళ్లేలా ఈ వాహకనౌకను రూపొందిస్తున్నామని తెలిపారు. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, సుదూర రోదసి యాత్రలు, మానవసహిత యాత్రలు, కక్ష్యలోకి సరకు రవాణా, ఒకేసారి బహుళ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించడం వంటి లక్ష్యాల సాధనకు ఇది దోహదపడుతుందని ఇస్రోకు చెందిన మరో అధికారి చెప్పారు. చాలా సులువుగా, పెద్ద సంఖ్యలో ఉత్పత్తికి వీలు కల్పించేలా ఎన్జీఎల్వీని డిజైన్ చేస్తామని తెలిపారు. తద్వారా అంతరిక్షయాత్రల ఖర్చును తగ్గించడానికి వీలవుతుందన్నారు. ప్రస్తుతం ఇస్రోకు ప్రధాన వాహకనౌకగా ఉన్న పీఎస్ఎల్వీ.. 1980ల నాటి పరిజ్ఞానం ఆధారంగా రూపొందిందని, భవిష్యత్ ప్రయోగాలకు అది ఉపయోగపడదని సోమ్‌నాథ్ తెలిపారు. ఎన్జీఎల్వీ డిజైన్‌ను వచ్చే ఏడాది కల్లా సిద్ధం చేయాలని ఇస్రో భావిస్తోంది. అనంతరం దాన్ని ఉత్పత్తి కోసం పరిశ్రమలకు అందించాలనుకుంటోంది. ఈ రాకెట్‌ను 2030లో తొలిసారి రోదసిలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఎన్జీఎల్వీలో మూడు దశలు ఉండొచ్చని భావిస్తున్నారు. అందులో మిథేన్, ద్రవ ఆక్సిజన్ లేదా కిరోసిన్, ద్రవ ఆక్సిజన్‌తో కూడిన పర్యావరణ అనుకూల ఇంధనాలను ఉపయోగిస్తారు. ఈ రాకెట్‌కు సంబంధించిన పునర్వినియోగ వెర్షన్‌తో కిలో బరువును రోదసిలోకి పంపడానికి 1900 డాలర్లు ఖర్చవుతుందని సోమ్‌నాథ్ ఇటీవల పేర్కొన్నారు. సాధారణ వెర్షన్‌తో ఈ వ్యయం 3వేల డాలర్లు అవుతుందని పేర్కొన్నారు