గుంటూరు : ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ప్రజా ఫిర్యాదులను తీసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ‘జగనన్నకు చెబుదాం’ పేరిట కొత్తగా ప్రజా ఫిర్యాదులను తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాలు చేపట్టిన వివిధ ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాలకు చెక్ పెట్టేలా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని రూపొందించినట్టు సమాచారం. పశ్చిమబంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహిస్తున్న ‘దీదీకో బోలో’ కార్యక్రమం తరహాలోనే దీన్ని చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రజా ఫిర్యాదులు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. సమస్యల్ని తెలుసుకుని సీఎం పరిష్కరించారని ప్రజలు అనుకునేలా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు సమాచారం. “జగనన్నకు చెబుదాం” పేరిట ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సమాచారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపడుతున్న జనవాణికి ప్రతిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించినట్టు సమాచారం. జనవాణి పేరిట ఇప్పటికే ప్రజల సమస్యల్ని ఆర్జీల రూపంలో తీసుకుంటూ ప్రభుత్వంపై జనసేన పార్టీ ఒత్తిడి పెంచుతోంది. దీనికి ప్రతిగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం నుంచి వచ్చిన ఆలోచన మేరకు ‘జగనన్నకు చెబుదాం’ అనే ట్యాగ్ లైన్ కింద ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ప్రజల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లేలా ఓ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళిక చేస్తున్నారు. దీనికోసం ఓ ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబరును కూడా ప్రభుత్వం కేటాయించేలా ఆలోచన చేస్తున్నారు. నవంబరు మొదటి వారంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించినా అందుకు తగిన మౌలిక వ్యవస్థ సిద్ధం కాకపోవటంతో కొన్ని రోజులకు వాయిదా పడినట్టు సమాచారం. మొత్తానికి నవంబరు నెల చివరిలోగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం కింద ప్రజల నుంచి సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం చేపట్టే అవకాశం కనిపిస్తోంది.
పశ్చిమ బంగాలోనూ అక్కడి సీఎం మమతా బెనర్జీ కూడా ఇదే తరహా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. “దీదీకో బోలో” అనే కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు , ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ఆ తరహాలోనే జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. ఏడాదిన్నరలోనే ఎన్నికలు రానున్న దృష్ట్యా.. ప్రతిపక్షాలకు ప్రజలు దగ్గర కాకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. గత ప్రభుత్వంలోనూ “సీఎం కనెక్ట్” పేరుతోనూ ఇదే తరహా కార్యక్రమాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందన పేరిట ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తోంది. లక్షల సంఖ్యలో ఈ ఫిర్యాదులు వస్తున్నా ఆ స్థాయిలో పరిష్కారానికి నోచుకోవడం లేదు. అవినీతి నిరోధానికి 14400, సాధారణ ఫిర్యాదుల కోసం 1902, ఇసుక, అక్రమ మద్యం ఫిర్యాదుల కోసం 14500, రైతు భరోసా కోసం 1907, పాఠశాల విద్యకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 14417, అలాగే గ్రామీణ స్థాయిలో గ్రామ సచివాలయాల్లోనూ ఫిర్యాదులను ప్రభుత్వం స్వీకరిస్తోంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రజల సమస్యల్ని స్వీకరించేందుకు ప్రజాదర్బార్ నిర్వహించాలని భావించినా దీన్ని అమల్లోకి తీసుకురాలేకపోయారు. ప్రజాదర్భార్ కోసం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం తాడేపల్లిలోని నివాసంలో ఏర్పాట్లు కూడా చేసి తర్వాత ఆ కార్యక్రమాన్ని వెనక్కు తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తటం, సమస్యలు స్వీకరించేందుకు ఆస్కారం లేకపోవటంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.