ప్రకటించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు
సియోల్ : త్వరలోనే తాము గూఢచర్య ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నామని ఉత్తర కొరియా
అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించారు. ఆ దేశ మీడియా బుధవారం వెల్లడించిన
వివరాల ప్రకారం.. ఉత్తర కొరియా ఏరోస్పేస్ విభాగాన్ని మంగళవారం పరిశీలించిన
కిమ్ గూఢచర్య ఉపగ్రహం అవసరాన్ని నొక్కి చెప్పారు. కొన్ని దేశాలు చేస్తున్న
దుందుడుకు, రెచ్చగొట్టే చర్యల నుంచి రక్షణ పొందడానికి ఇలాంటి ఉపగ్రహం
అత్యవసరమని అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను ఉద్దేశించి
వ్యాఖ్యానించారు. స్పై శాటిలైట్ తయారీ ఇప్పటికే పూర్తయిందని, దానిని త్వరగా
ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలకు ఆదేశాలిచ్చినట్లు ఉన్ తెలిపారు.
ఇంటెలిజెన్స్ సమాచార సేకరణకు ఇలాంటి ఉపగ్రహాలు మరికొన్నింటిని ప్రయోగిస్తామని
వెల్లడించారు. అయితే వీటిని కక్ష్యలో ప్రవేశపెట్టడానికి దీర్ఘశ్రేణి రాకెట్
కావాల్సి ఉండగా.. వాటిని ప్రయోగించకుండా ఉత్తర కొరియాపై గతంలోనే ఐరాస నిషేధం
విధించింది. కిమ్ తాజా నిర్ణయం కొరియా ద్వీపకల్పంలో శాంతికి పెనువిఘాతం
కలిగిస్తుందని దక్షిణ కొరియా వ్యాఖ్యానించింది.