అమరావతి : రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆదుకునేందుకు ఈప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్,ఆహారశుద్ధి శాఖా మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ గతంలో ఏప్రభుత్వం చేయని రీతిలో ఈ ప్రభుత్వం రైతాంగానికి అన్ని విధాలా సహకారాన్ని అందించడం జరుగుతోందని పేర్కొన్నారు. వైయస్సార్ రైతు భరోసా-పియం కిసాన్ పధకం కింద మొదటి విడతలో 50 లక్షల 10 వేల మంది రైతులకు 3 వేల 757 కోట్ల రూ.లు లబ్ది కలిగించామని తెలిపారు. అలాగే రెండవ విడత కింద అక్టోబరు 17వతేదీన 50 లక్షల 90 వేల మంది రైతులకు 2 వేల 36 కోట్ల రూ.ల సహాయం అందించామని చెప్పారు.గత ప్రభుత్వం రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సహా వివిధ పధకాల కింద చెల్లించాల్సిన బకాయిలను కూడా ఈప్రభుత్వం చెల్లిస్తూ రైతాంగానికి అన్నివిధాలా అండగా నిలుస్తోందని చెప్పారు. రైతులకు ఎరువులు, విత్తనాలు,పురుగు మందులు వంటివి లేబిలింగ్ ఉన్న నాణ్యమైన వస్తువులనే రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తోందని స్పష్టం చేశారు.అంతేగాక పంటల బీమాకు సంబంధించిన ప్రీమియం ఒక్క పైసా కూడా రైతులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రీమియం మొత్తం పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తోందని మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నడూలేని రీతిలో రైతాంగానికి అన్ని విధాలా అండగా ఉంటూ వ్యవసాయం మరియు రైతాంగ సంక్షేమం పట్ల చిత్తశుధ్ధితో పనిచేస్తున్న ఈప్రభుత్వంపై బురద జల్లే విధంగా రైతాంగాన్ని తప్పుదోవ పట్టించే రీతిలో కొంతమంది ప్రతిపక్షనేతలు అనవసరమైన విమర్శలు చేయడంతో పాటు కొన్ని పత్రికలు అసత్య కధనాలను ప్రచురించడం సమంజసం కాదని మంత్రి గోవర్ధన రెడ్డి హితవు పలికారు.