వెలగపూడి : రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, నిషేధిత జాబితాల గురించి, వాటిని క్రమబద్దీకరించేందుకు వీలుగా అవగాహన కల్పించడానికి రాష్ట్రంలోని జిల్లా రెవెన్యూ అధికారులతో భూపరిపాలన, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (భూములు) శాఖ ముఖ్య కార్యదర్శి జి. సాయి ప్రసాద్ అధ్యక్షతన వర్క్ షాప్ నిర్వహించారు. మంగళగిరి సీసీఎల్ఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ వర్క్ షాపులో అసైన్డ్ భూములు, నిషేధిత జాబితాలు, ఇళ్ల స్థలాలు, భూముల రీసర్వే తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీసీఎల్ఏ జి. సాయి ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త జిల్లాల వారీగా 22-ఏ జాబితా భూముల వివరాల నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జాబితాలు తయారుచేసే క్రమంలో అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, దేవాదాయ/వక్ఫ్ భూములు, చుక్కల భూములు, ఇతర భూములు కేటగిరీలవారీగా విభజనపై అవగాహన కల్పించారు. రాష్ట్రంలో కొత్త జిల్లా ఏర్పాటుతో ప్రతి జిల్లాకి సంబంధించి రికార్డులను ఎలా నిర్వహించాలని, నివేదికలు ఎలా రూపొందించాలో సోమవారం ఒక రోజు నిర్వహించిన వర్క్ షాపులో కూలంకషంగా చర్చించి వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీసీఎల్ఏ & సెక్రటరీ ఎ.ఎండీ. ఇంతియాజ్, ల్యాండ్స్ జాయింట్ సెక్రటరీ జి. గణేష్ కుమార్, విజిలెన్స్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ అపరాజిత సింగ్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.