గుంటూరు : ఆధార్ కార్డు నంబరు, వివరాలతో సహా డేటా నిక్షిప్తం చేయాలని, వీటి ద్వారా వచ్చిన మార్పులను చెప్పగలిగేలా ప్రగతి కనిపించాలన్నారు. సుస్ధిర లక్ష్యాల సాధనలో గ్రామ, వార్డు సచివాలయాలు యూనిట్‌గా ఉండాలన్న సీఎం సచివాలయాల్లో సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణకు మండలాల వారీగా వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ప్రతి విభాగాధిపతి ప్రతినెలలో రెండు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించి.. సిబ్బంది పనితీరు సహా ప్రగతి లక్ష్యాల సాధనకు ఏ రకంగా పని చేస్తున్నారనే విషయాన్ని నిశితంగా పరిశీలన చేయాలన్నారు. దీనివల్ల సిబ్బందికి సరైన మార్గదర్శకత్వం, అవగాహన కలుగుతుందన్నారు.గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో వాస్తవిక రూపం దాల్చిన అంశాలకు సంబంధించి వివరాల నమోదు ఎలా జరుగుతుందనే విషయంపై జేసీలు, కలెక్టర్లు పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు. ప్రగతి లక్ష్యాల సాధనలో అడుగులు ముందుకుపడతాయన్న సీఎం.. దేశంలో రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ప్రతి ప్రభుత్వ విభాగానికి మండలాల వారీగా వీలైనంత త్వరగా అధికారుల నియామకం జరగాలని సీఎం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి నిర్దేశించిన ఎస్ఓపిలను మరోసారి పరిశీలించి వాటిలో మార్పులు, చేర్పులు అవసరమైతే చేయాలన్నారు. నెలకు కనీసం రెండు సచివాలయాలను ప్రభుత్వ విభాగాధిపతులు పర్యవేక్షించాలన్నారు. వ్యవసాయం, విద్య, మహిళ శిశు సంక్షేమం, ఆరోగ్యం తదితర రంగాల్లో ప్రభుత్వం చేస్తోన్న తరహాలో దేశంలో ఏ ప్రభుత్వం ఖర్చు చేయడంలేదన్న సీఎం.. ఓనర్షిప్ తీసుకుని వాటిని సమగ్రంగా పర్యవేక్షణ చేయాల్సి అవసరం ఉందన్నారు. ప్రగతి లక్ష్యాల సాధనపై ప్రతి నెల రోజులకోసారి వివరాలు నమోదు కావాలని, దీనికోసం ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికతను వాడుకోవాలని సీఎం సూచించారు.డ్రాప్‌అవుట్స్ అన్న మాట ఎక్కడా వినిపించకూడదని స్పష్టంచేశారు. సచివాలయాల వారీగా, వాలంటీర్ల వారీగా ఎప్పటికప్పుడు దీనిపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. ఎక్కడైనా డ్రాప్‌అవుట్ జరిగిన ఘటన తెలిస్తే.. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా విద్యార్థుల హాజరును పరిశీలించాలని ఆదేశించిన సీఎం.. పిల్లలు ఎవరైనా వరుసగా 3 రోజులు స్కూలుకు రాకపోతే కచ్చితంగా మూడోరోజు ఇంటికివెళ్లి ఆరాతీయాలన్నారు. పిల్లలు స్కూలుకు రాకపోతే కచ్చితంగా ఎస్ఎంఎస్లు పంపాలని అధికారులకు స్పష్టం చేశారు. కల్యాణమస్తు కోసం నిర్దేశించిన అర్హతలు.. బాల్యవివాహాల నివారణ, అక్షరాస్యత పెంపు కోసం తోడ్పాటునందిస్తాయన్నారు. విద్యారంగం సహా వివిధ రంగాల్లో అమలు చేస్తున్న సంస్కరణలు వలన రానున్న రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని సీఎం అన్నారు.