గ్లెన్ ఫిలిప్స్ (64 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 104) లక్కీ శతకంతోపాటు ట్రెంట్ బౌల్ట్ (4/13) బంతితో చెలరేగడంతో.. టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. సూపర్-12లో భాగంగా శనివారం గ్రూప్-2లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 65 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. మొత్తం 5 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచి సెమీస్ అవకాశాలను మెరుగుపరచుకొంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆరంభంలోనే లంక బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో.. తొలి 4 ఓవర్లలోనే డాషింగ్ ఓపెనర్లు ఫిన్ అలెన్ (1), డెవాన్ కాన్వే (1)తోపాటు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (8)ను కోల్పోయి కివీస్ కష్టాల్లో పడింది. అయితే, క్యాచ్‌లు వదిలేయడం, పేలవ ఫీల్డింగ్ కారణంగా మ్యాచ్‌పై పట్టుబిగించే సువర్ణావకాశాన్ని లంక చేజార్చుకొంది. న్యూజిలాండ్ 15/3తో దీనస్థితిలో ఉన్న సమయంలో డారెల్ మిచెల్ (22), ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఫిలిప్స్ నాలుగో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొన్నారు.
వ్యక్తిగత స్కోర్లు 12, 45 వద్ద బతికి పోయిన ఫిలిప్స్.. సెంచరీతో జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. ఛేదనలో లంక 19.2 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. బౌల్ట్ దెబ్బకు 8 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకొన్న లంక.. ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. రాజపక్స (34), కెప్టెన్ షనక (35) పోరాడినా.. అప్పటికే ఓటమి ఖరారైంది. ఈ ఓటమితో లంక ఫైనల్-4 ఆశలు దాదాపు ముగిసినట్టే.