భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్
ఆయన ఒక వ్యక్తి కాదు..శక్తి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నివాసానికి రజినీకాంత్
విజయవాడ : ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల అంకురార్పణ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన
రజనీకాంత్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్
స్ఫూర్తితో తెలుగు ప్రజలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌కు భారత
రత్న ఇవ్వాలని, ఇచ్చే వరకు తెలుగు ప్రజలు అడుగుతూనే ఉంటారని టీడీపీ అధినేత
చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల అంకురార్పణ
సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ
ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు ప్రజలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
‘‘భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్. ఆయన ఒక వ్యక్తి కాదు.. శక్తి. ఆయన
ఎక్కడ ఉంటే అక్కడ స్ఫూర్తి ఉంటుంది. పది కోట్ల మంది తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌కు
ఘన నివాళి అర్పించాలి. ఎన్టీఆర్ అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదు. దేశ
రాజకీయాల్లో మార్పు తేవాలని సంకల్పించారు. తెలుగుజాతి అవమానాలకు గురవుతోందని
బాధపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటం కోసం రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు
భారతరత్న ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.
భారత రత్న ఇచ్చే వరకు తెలుగు జాతి పోరాడుతూనే ఉంటుంది. ఎన్టీఆర్ స్ఫూర్తి..
తెలుగు జాతిలో శాశ్వతంగా ఉండాలి. ఆయన వారసుడిగా వచ్చిన బాలకృష్ణ.. సినిమాలతో
పాటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు.
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని సేవా భావంతో నడిపిస్తున్నారని చంద్రబాబు
అభినందించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల అంకురార్పణ సభకు ముఖ్యఅతిథిగా
విచ్చేసిన రజనీకాంత్‌కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. మంచి మానవత్వం ఉన్న
వ్యక్తి రజనీకాంత్ అని, ఆయనకు జపాన్‌లో కూడా అభిమానులున్నారని తెలిపారు.
సినిమా చిత్రీకరణను రద్దు చేసుకుని ఉత్సవాలకు వచ్చారని అన్నారు. ఒక నాయకుడు
మరో నాయకుడిని ఎలా ప్రభావితం చేశారో రజనీకాంత్ చెప్పారని పేర్కొన్నారు.
నందమూరి బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ నేతలు,
కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
చంద్రబాబు నివాసానికి రజినీకాంత్ : ఎన్టీఆర్ అసెంబ్లీ, చారిత్రిక ప్రసంగాల
పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొనేందుకు అమరావతి వచ్చిన అగ్ర
నటులు రజనీ కాంత్ ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తేనీటి విందుకు
ఆహ్వానించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ఉండవల్లిలోని నారా చంద్రబాబు నాయుడు
ఇంటికి వచ్చారు. రజనీ కాంత్ కి టీడీపీ అధినేత సాదర స్వాగతం పలికారు.టీడీపీ
అధినేత చంద్రబాబు నివాసానికి రజినీకాంత్ వెళ్లారు. ఈ సందర్భంగా రజినీకాంత్,
ఎన్టీఆర్ కుటుంబసభ్యులకు చంద్రబాబు తేనీటి విందు ఇచ్చారు. అనంతరం చంద్రబాబు
నివాసం నుంచి నేరుగా అనుమోలు గార్డెన్స్‌లో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి
వేడుకల్లో పాల్గొంటారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో చంద్రబాబు, రజినీకాంత్,
ఎన్టీఆర్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.