రైతులకు ఆడిగిన వెంటనే విద్యుత్తు కనెక్షన్లు
జగనన్న కాలనీల విద్యుదీకరణ పనులు భేష్
విద్యుత్ ప్రమాదాల నివారణపై దృష్టి
విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గించండి
బకాయిలపై దృష్టి పెట్టండి
గ్రామ, వార్డు సచివాలయాల పోర్టల్ ద్వారా విద్యుత్ ఫిర్యాదుల నమోదు
రాష్ట్ర ఇంధన శాఖామంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతి : వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేయాలని
రాష్ట్ర ఇంధన శాఖామాత్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విద్యుత్
శాఖాధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో
శుక్రవారం ఉదయం రాష్ట్ర ఇంధనశాఖా మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా
రెడ్డి ఎపిఎస్పిడిసిఎల్, ఎపి ట్రాన్స్ కో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని
నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరా వ్యవస్థ
మెరుగవడంతో వినియోగదారులకు మెరుగైన విద్యుత్తును సరఫరా చేసేందుకు అవకాశం
ఏర్పడిందన్నారు. వినియోగదారుల సమస్యలకు సంబంధించి సర్కిల్, డివిజన్ స్థాయిల్లో
తరచూ సమీక్షలను నిర్వహించి, ఆ సమస్యల్ని అధిగమించేందుకు అవసరమైన చర్యలు
చేపట్టాలన్నారు. విద్యుత్ సంస్థ పరిధిలో వ్యవసాయ విద్యుత్ సర్వీసుల మంజూరుపై
సంతృప్తి వ్యక్తం చేస్తూ, రైతులు అడిగిన వెంటనే విద్యుత్ సర్వీసులను మంజూరు
చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక జగనన్న కాలనీల విద్యుదీకరణ పనులు బేషుగ్గా
వున్నాయని పేర్కొన్నారు. జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులు పూర్తవుతున్న భవనాలకు
విద్యుత్ సర్వీసులను సకాలంలో మంజూరు చేయాలన్నారు. సంస్థ పరిధిలో సబ్-స్టేషన్ల
నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. అలాగే వివిధ అభివృద్ధి పనులను సకాలంలో
పూర్తి చేయని కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. డిస్కమ్
పరిధిలో తరచూ విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వాటిని పూర్తి
స్థాయిలో అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా వినియోగదారులను
నాణ్యమైన విద్యుత్తును అందించడంతో పాటు విద్యుత్ పంపిణీ నష్టాలను కూడా
తగ్గించేందుకు అవకాశం వుంటుందన్నారు. సంస్థ పరిధిలో పారిశ్రామిక
వినియోగదారులకు కూడా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని, వినియోగదారులు
అడిగిన వెంటనే విద్యుత్ కనెక్షనన్ ను మంజూరు చేయాలని సూచించారు. విద్యుత్
బకాయిల వసూళ్ళకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. వ్యవసాయ విద్యుత్ వినియోగదారుల
సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు వీలుగా సబ్-స్టేషన్ కమిటీలను ఏర్పాటు
చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎపిఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్
కె. సంతోష రావు మాట్లాడుతూ సంస్థ పరిధిలో సబ్-స్టేషన్ల నిర్మాణాన్ని వేగవంతం
చేస్తున్నామన్నారు. సబ్-స్టేషన్ల నిర్మాణ వ్యయాన్ని కూడా తగ్గించేందుకు కృషి
చేస్తున్నామని తెలిపారు. సంస్థ పరిధిలో రైతులు వ్యవసాయ విద్యుత్తు సర్వీసుకు
దరఖాస్తు చేసినవెంటనే త్వరితగతిన సర్వీసును మంజూరు చేసేందుకు చర్యలు
తీసుకుంటామని వివరించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్తు ప్రమాదాల నివారణ,
విద్యుత్తు పొదుపు అంశాలపై వినియోగదారుల అవగాహనా సదస్సులను నిర్వహించడం
జరుగుతోందన్నారు. ఇక విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు వీలుగా లైన్లను
క్షుణ్ణంగా పరిశీలించి, ప్రమాదం జరిగేందుకు అవకాశం వున్న చోట్ల వెంటనే మరమ్మతు
పనులను పూర్తి చేస్తున్నామన్నారు. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో
సబ్-స్టేషన్లలో విద్యుత్తు సరఫరా ఆగిపోయే విధంగా అధునాతన సాంకేతికతను
వినియోగిస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో పాడైపోయిన, కాలిపోయిన నియంత్రికలను
తక్షణమే మార్చేందుకు వీలుగా సరిపడే స్థాయిలో నియంత్రికల నిల్వలు
వున్నాయన్నారు. సంస్థ పరిధిలో వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తును
సరఫరా చేయడంతోపాటు, సత్వర సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
అనంతరం ఎపిట్రాన్స్ కో డైరెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ విద్యుత్ సరఫరా కోసం
ఏర్పాటు చేసే టవర్ల నిర్మాణానికి కొన్నిచోట్ల ఆటంకాలు ఎదురవుతున్నాయనే
అంశాన్ని మంత్రివర్యుల దృష్టికి తీసుకురావడంతో వాటిని పరిష్కరించేందుకు చర్యలు
తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరం
పరిష్కరించేందుకు వీలుగా గ్రామ, వార్డు సచివాలయాల పోర్టల్ ద్వారా విద్యుత్
సమస్యలను నమోదు చేసే ప్రక్రియను రాష్ట్ర ఇంధన శాఖామాత్యులు శ్రీ పెద్దిరెడ్డి
రామచంద్రా రెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సమావేశంలో ఎపిఎస్పిడిసిఎల్ డైరెక్టర్లు వి.ఎన్. బాబు, ఎన్.వి.ఎస్.
సుబ్బరాజు, కె. శివప్రసాద రెడ్డి, చీఫ్ జనరల్ మేనేజర్లు డి.ఎస్. వరకుమార్, వై.
లక్ష్మీ నరసయ్య, డి.వి. చలపతి. పి. ఆయూబ్ ఖాన్. కె. గురవయ్య, కె.ఆర్.ఎస్.
ధర్మజ్ఞాని, ఓఎస్ డి ఎన్. శ్రీనివాసులు, ఎపిట్రాన్స్ కో చీఫ్ ఇంజనీర్ రమణ
తదితరులు పాల్గొన్నారు.