విడుదలను ఆపాలంటూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించిన సర్వోన్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ : కొన్నిరోజులుగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన హిందీ చిత్రం
‘ద కేరళ స్టోరీ’ విడుదలను ఆపాలంటూ దాఖలైన పిటిషన్లపై అత్యవసర విచారణ జరపడానికి
సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ చిత్రంపై అభ్యంతరాలుంటే తగిన హైకోర్టుకు
వెళ్లాలని పిటిషనర్లకు సూచించింది. ఈ నెల 5న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర
కథాంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేరళలో వేల సంఖ్యలో హిందూ యువతులను
బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి, వారిని ఐసిస్ ఉగ్ర ముఠా ఉగ్రవాద
కార్యకలాపాలకు వినియోగించుకుంటోందని ట్రైలర్లో చూపించడంతో వివాదం మొదలైంది. ఈ
చిత్రం విడుదలను ఆపాలని కోరుతూ జమియాత్-ఉలమా-ఎ-హింద్ సంస్థతోపాటు పలువురు
సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నరసింహల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ
చిత్రం సమాజంలో భిన్నవర్గాల మధ్య విద్వేషాన్ని, శత్రుత్వాన్ని పెంచేలా ఉందని
జమియాత్-ఉలమా-ఎ-హింద్ వాదించింది. ఈ చిత్ర కథాంశం కల్పితమని పేర్కొంటూ
టైటిల్స్‌లో ప్రకటించేలా చిత్రబృందానికి ఆదేశాలివ్వాలంటూ మరో వ్యాజ్యం
దాఖలైంది. ఆర్టికల్ 32 కింద దీన్ని విచారించాలని పిటిషనర్ కోరారు. దీనిపై
ధర్మాసనం స్పందిస్తూ ప్రతి అంశంలోనూ ఆర్టికల్ 32 కింద పిటిషన్ వేయడం
సరికాదని, ఆర్టికల్ 226 కింద హైకోర్టుల్లోనూ అవసరమైన ఉత్తర్వులు పొందే అవకాశం
ఉందని వివరించింది. జమియాత్-ఉలమా-ఎ-హింద్ పిటిషన్‌పై స్పందిస్తూ
హైకోర్టుల్లో అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు ఉన్నారని, స్థానిక అంశాలపై వారికి
మంచి అవగాహన ఉంటుందని పేర్కొంది. వీటితోపాటు ఇతర సంబంధిత పిటిషన్లనూ
తిరస్కరించింది. హైకోర్టుకు వెళ్లే అంశాన్ని పిటిషన్ల నిర్ణయానికే
విడిచిపెట్టింది.