నియోజకవర్గంలో త్రిముఖ పోటీ
విజయంపై ఎవరి ధీమా వారిదే
రాయచూరు : విజయ దాసులు పాలించిన మాన్వి నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్,
జేడీఎస్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మాజీ ఎంపీ బి.వి.నాయక్ బీజేపీ నుంచి,
మాజీ ఎమ్మెల్యే హంపయ్య నాయక్ కాంగ్రెస్ నుంచి, సిట్టింగ్ ఎమ్మెల్యే రాజా
వెంకటప్ప నాయక్ జేడీఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. 2018లో దేవదుర్గలో
కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన బీ.వీ.నాయక్ ఈసారి బీజేపీలో చేరి
అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2018లో జేడీఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే
రాజా వెంకటప్ప నాయక్ రెండో సారి గెలుపు కోసం ఆరాట పడుతున్నారు. 2008–2013
మధ్య కాలానికి ఎమ్మెల్యేగా గెలుపొందిన హంపయ్య నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా
పోటీ చేస్తున్నారు. 2018లో పోటీ చేసిన జేడీఎస్ అభ్యర్థి వెంకటప్ప నాయక్
కాంగ్రెస్ అభ్యర్థి హంపయ్య నాయక్‌ను ఓడించారు. ఈ ఎన్నికల్లో
బి.వి.నాయక్(బీజేపీ) తొలిసారి విజయం కోసం, హంపయ్య నాయక్(కాంగ్రెస్)
మూడోసారి గెలుపు కోసం, రాజా వెంకటప్ప నాయక్(జేడీఎస్) రెండోసారి విజయం కోసం
కృషి చేస్తున్నారు. జేడీఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు స్థానికులు కాగా బీజేపీ
అభ్యర్థి మాత్రం దేవదుర్గ నుంచి మాన్వికి వలస వచ్చిన అభ్యర్థి అని ప్రజలు
చర్చించుకుంటున్నారు. జేడీఎస్ అభ్యర్ధి గత ఐదేళ్ల పాలనలో తాను చేసిన
అభివృద్ధితో పాటు మాజీ సీఎం కుమారస్వామి చేసిన అభివృద్ధి పనులను వివరించి
ప్రచారం చేయనున్నారు. నియోజక వర్గంలో తుంగభద్ర నది ఉండగా, వరి, మిరప, పత్తి
తదితర వాణిజ్య పంటలను పండిస్తున్నారు. కాగా జిల్లాలోని మాన్వి నియోజకవర్గంలో
1,13,541 మంది పురుషులు, 1,18,309 మంది మహిళా ఓటర్లున్నారు.