గత ఉప ఎన్నికలలోనూ వీరే పోటీ
తెలుగు– తమిళ ఓటర్లు కీలకం
యశవంతపుర : బెంగళూరు నగర పరిధిలో రాజకీయాలకు సవాల్‌గా మారిన రాజరాజేశ్వరి నగర
నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న
మంత్రి మునిరత్నను ఓడించటానికీ కాంగ్రెస్ మహిళా అభ్యర్థిని పోటీలో నిలిపింది.
దివంగత ఐఏఎస్ అధికారి డీకే రవి భార్య హెచ్.కుసుమకు కాంగ్రెస్ టికెట్
ఇచ్చింది. దీంతో పోటీ ఎలా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
గత ఉప ఎన్నికలలోనూ వీరే పోటీ : మునిరత్న 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి,
2020లో అపరేషన్ కమలంలో బీజేపీలో చేరారు. తరువాత జరిగిన ఉప ఎన్నికలలో కూడా
వీరిద్దరే తలపడ్డారు. మునిరత్న 1,25,990 ఓట్లతో గెలుపొందగా, కుసుమ 67,877
ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. అప్పట్లో జేడీఎస్ అభ్యర్థి
కృష్ణమూర్తికి 10,289 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ జోరును అడ్డుకోవడానికి
కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, బెంగళూరు
గ్రామాంతర ఎంపీ డీకే సురేశ్‌లు ఈ నియోజకవర్గంపై శ్రద్ధ పెట్టారు. ఇక మునిరత్న
ఈసారి కూడా గెలిచి నాలుగోసారి అసెంబ్లీకి వెళతానని ధీమాను వ్యక్తం చేశారు.
గతంలో మాదిరే జేడీఎస్ ఈసారి కొన్ని ఓట్లను సాధించగలదేమో కానీ జయాపజయాలను
ప్రభావితం చేసేలా లేదని స్థానిక ప్రముఖులు పేర్కొన్నారు.
తెలుగు– తమిళ ఓటర్లు కీలకం : ఆర్ఆర్ నగర పరిధిలోని యశవంతపుర, మత్తికెరె,
జాలహళ్లి ప్రాంతాలలో ఉపాధి కోసం వచ్చిన తెలుగు, తమిళ వలసదారులు అధికంగా
స్థిరపడ్డారు. వీరు ఓటింగ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తారు. పీజీ హాస్టళ్లు,
హోటల్స్, పీణ్యలో ఫ్యాక్టరీలలో పనిచేసే ప్రవాసాంధ్రులు ఇక్కడ అధికంగా
నివసిస్తున్నారు. ఎవరిని గెలిపించాలనేది ఈ ఓటర్లే నిర్ణయిస్తారనడం అతిశయోక్తి
కాదు. వలస వచ్చి స్థిరపడిన తెలుగువారు రెండు పార్టీలలోను జోరుగా ప్రచారం
చేస్తున్నారు.
రాజరాజేశ్వరి నగర ప్రాంతం :(బెంగళూరులో సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఇది ఒకటి)
మంత్రి వర్సెస్ ఐఏఎస్ సతీమణి
నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు
మొత్తం ఓటర్లు– 4,78,165
పురుషులు– 2,46,976
సీ్త్రలు – 2,31,097
ట్రాన్స్జెండర్లు– 92 మంది