సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ను తొలి ప్రధానిగా చేసి ఉంటే.. దేశం నేడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఎదురయ్యేవి కావని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశ ప్రజల్లో ఈ మేరకు ఓ అభిప్రాయం ఉందని చెప్పారు.
దిల్లీ: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ను తొలి ప్రధానిగా చేసి ఉంటే.. దేశం నేడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఎదురయ్యేవి కావని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశ ప్రజల్లో ఈ మేరకు ఓ అభిప్రాయం ఉందని చెప్పారు. పటేల్ జయంతి పురస్కరించుకుని సోమవారం దిల్లీలోని సర్దార్ పటేల్ విద్యాలయలో ఆయన ప్రసంగించారు. పటేల్ ఘనతను కనుమరుగు చేసేందుకు అనేక ప్రయత్నాలూ జరిగాయని ఆరోపించారు. అయితే, ఆయనే లేకపోతే దేశ చిత్రపటం ఇప్పటిలా ఉండేది కాదన్నారు. ఈ నేపథ్యంలో.. పటేల్ ఆశయాలను అర్థం చేసుకునేందుకు ఆయన జీవితాన్ని అధ్యయనం చేయాలని విద్యార్థులకు సూచించారు. స్థానిక భాషల్లో ప్రాథమిక విద్య ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ.. విద్యార్థులు సైతం తమ మాతృభాష, యాసలను సజీవంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.‘సర్దార్ పటేల్ తన దార్శనికతను అమల్లోకి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడ్డారు. ఆయనో కర్మయోగి. తనను తాను ప్రచారం చేసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించని నాయకుల్లో ఒకరు. ఆరోగ్యం దెబ్బతిన్నా.. తెల్లవార్లు పని చేసేవారు. జునాగఢ్ సంస్థానం విలీనంపై తెల్లవారుజామున 4.20 గంటలకు సంతకం చేశారు. సర్దార్‌ను భారత్‌కు తొలి ప్రధానిగా చేసి ఉంటే.. దేశం నేడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఎదురయ్యేవే కావని చాలా మంది నమ్ముతారు’ అని షా అన్నారు. గుజరాత్‌లోని మోర్బీలో వంతెన ప్రమాదంపై అమిత్ షా ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేశారు.