గుజరాత్‌లోని మోర్బీలో బ్రిడ్జి కూలిన ఘటనపై స్పందించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరాకరించారు. ఈ ఘటనపై రాజకీయాలు చేయాలనుకోవడం లేదని చెప్పారు.
హైదరాబాద్: గుజరాత్‌లోని మోర్బీలో బ్రిడ్జి కూలిన ఘటనపై స్పందించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరాకరించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఓ విలేకరి దీనిపై ప్రశ్నించగా.. ఈ విషయాన్ని తాను రాజకీయం చేయదలచుకోలేదని పేర్కొన్నారు. ఈ ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, దీనిపై ఏదైనా మాట్లాడితే వారిని అవమానించినట్లే అవుతుందని పేర్కొన్నారు. అందుకే ఈ ఘటనపై రాజకీయాలు చేయాలనుకోవడం లేదని చెప్పారు. అదే సమయంలో గుజరాత్ ఎన్నికల్లో విజయంపై ఆయన ధీమా వ్యక్తంచేశారు. భాజపా ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉందని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటనలపైనే ఆధారపడుతోందని, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు బ్రిడ్జి కూలిన ఘటనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర నేతలు మాత్రం గుజరాత్‌లోని భాజపా సర్కారుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ ఘటనకు భాజపా ప్రభుత్వానిదే బాధ్యతంటూ ఆ పార్టీ ఎంపీ రణ్‌దీప్ సూర్జేవాలా విమర్శించారు. ఆ పార్టీ త్రిపుర ఇన్‌ఛార్జి అజోయ్ కుమార్ ప్రధానిపై విమర్శలు గుప్పించారు. గతంలో బెంగాల్లో ఓ బ్రిడ్జి కూలిన ఘటనలో ప్రధాని మోదీ మమత ప్రభుత్వాన్ని నిందించారు. సరిగ్గా అవే మాటలను అజోయ్ ప్రధానిపై ఇప్పుడు ప్రయోగించారు. మోర్బీ బ్రిడ్జి ఘటన యాక్ట్ ఆఫ్ ఫ్రాడ్ అని, మోదీజీకి ఆ దేవుడే సందేశం పంపించాడని పేర్కొన్నారు. గుజరాత్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ వారంలోనే ఈసీ నోటిఫికేషన్ వెలువరించే అవకాశం ఉంది.