ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్–యూసీసీ) మరోసారి తెరపైకి వచ్చింది. ఒకే దేశం ఒకే చట్టం ఎజెండాతో గతంలో ఉత్తరాఖండ్ ఎన్నికలప్పుడు యూసీసీ అమలుకు బీజేపీ సర్కారు కమిటీ వేయడం తెలిసిందే. తాజాగా గుజరాత్ కూడా అదే బాట పట్టింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇలా వరసగా యూసీసీ అమలుకు సై అంటూ ఉండడంపై చర్చ మొదలైంది. విభిన్న పరిస్థితులున్న దేశంలో ఒకే చట్టం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి… కుల, మత, జాతి, ప్రాంత, లింగ భేదాలు లేకుండా దేశ పౌరులందరికీ ఒకే విధమైన చట్టాలను అమలు చేయడమే ఉమ్మడి పౌరస్మృతి. ఇది అమల్లోకి వస్తే పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వ హక్కులు, జనన మరణాలు, దత్తత ప్రక్రియకు సంబంధించి పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. పౌరులందరికీ ఒకే చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని, అప్పుడే సమానత్వ హోదా దక్కుతుందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 కూడా చెబుతోంది. హిందూత్వ ఎజెండాతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఉమ్మడి పౌరస్మృతిని ఎన్నడో తన మేనిఫెస్టోలో చేర్చింది. తన రాజకీయ ఎజెండాలో ఆగ్రభాగాన ఉన్న అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టింది. కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ను రద్దు చేసింది. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిపై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ఒకేసారి అమలు చేయకుండా ముందు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి మొదలు పెట్టే వ్యూహంతో ముందుకు వెళ్తోంది. బీజేపీ పాలిత యూపీ, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.
అనుమానాలూ లేకపోలేదు…:అయితే యూసీసీపై హిందువుల్లోనే కాస్త వ్యతిరేకత వచ్చే ఆస్కారముందా అన్న అనుమానాలూ లేకపోలేదు. ‘‘భిన్న మతాలకు చెందిన వారికి వేర్వేరు లా బోర్డులున్నాయి. హిందూ మతానికి చెందినవారు కూడా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు ఆచారాలు పాటిస్తున్నారు. వాటన్నింటికీ ఏకరూపత ఎలా సాధ్యం?’’ అన్నది ఒక వాదన. కేవలం మెజార్టీ ఓటు బ్యాంకును ఏకమొత్తంగా కొల్లగొట్టేందుకేనని ఒక వర్గం ఆరోపిస్తోంది. ఇది బీజేపీ ఎన్నికల స్టంటని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితర నేతలు అంటున్నారు.
అందరికీ ఒకే చట్టాల్లేవా…?
ప్రస్తుతం దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలకు వారి మత సంప్రదాయాలకు అనుగుణంగా వ్యక్తిగత చట్టాలున్నాయి. ముస్లింలకు షరియా చట్టాలకు అనుగుణంగా ముస్లిం పర్సనల్ లా అమలవుతోంది. దాని ప్రకారం ముస్లిం పురుషులకు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతి ఉంది. వేరే మతస్తులకు మాత్రం చట్టప్రకారం ఒక్క భార్యే ఉండాలి. సివిల్ అంశాల్లో కాంట్రాక్ట్ చట్టం, సివిల్ ప్రొసీజర్ కోడ్ వంటి అనేకానేక ఉమ్మడి చట్టాలనూ పలు రాష్ట్రాల్లో భారీగా సవరించారు. గోవాలో 1867 నాటి కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉన్నా అక్కడా కేథలిక్కులకు, ఇతర మతాలకు భిన్నమైన నియమాలు పాటిస్తున్నారు. నాగాలాండ్, మిజోర, మేఘాలయాల్లోనైతే హిందూ చట్టాల్లో కూడా భిన్నత్వం ఉంది.