మందికి తెలియని దేశం. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం వెళదామని తయారయ్యారు. చైనా అధ్యక్షుడు
జిన్పింగ్ తమ దేశానికి రావాలంటూ గినియా అధ్యక్షుడికి ప్రత్యేకంగా ఆహ్వానం
పంపించారు. ఉన్నట్టుండి ఎందుకు అగ్రరాజ్యాలన్నీ ఈ ఊరూ పేరు తెలియని పపువా న్యూ
గినియా వెంటపడుతున్నాయంటే. పసిఫిక్ సముద్రంలో ఆస్ట్రేలియాకు ఉత్తరాన ఉండే ఓ
దీవి ఈ పపువా న్యూ గినియా. ప్రపంచంలో మూడో అతిపెద్ద ద్వీప దేశమిది. 1793 నుంచీ
అనేక దేశాల వలసరాజ్యంగా నలిగి 1975లో స్వాతంత్య్రం పొందింది. ఇంగ్లాండ్ రాజే
తమ రాజుగా బ్రిటన్ కామన్వెల్త్లో కొనసాగుతోంది. జీవ వైవిధ్యానికి పెట్టింది
పేరుగా ఖ్యాతిగాంచింది. అత్యధిక అడవులతో, 700కుపైగా పక్షిజాతులతో, 45వేల
కిలోమీటర్ల పొడవైన పగడపు దిబ్బలతో, వందల అగ్నిపర్వతాలతో అలరారుతున్న ఈ దీవిలో
వందలాది ఆదివాసీ తెగలు ఒంటరిగా జీవిస్తున్నాయి. దాదాపు 852 భాషలు
మాట్లాడతారిక్కడ. ప్రతి తెగకూ ప్రత్యేక భాష, సంప్రదాయాలు, అలవాట్లతో భాషా,
సాంస్కృతికపరంగానూ ఇదెంతో వైవిధ్యమైంది. వందల సంవత్సరాల వలస పాలనను కూడా
తట్టుకొని వీరంతా తమ భాషలను, సంప్రదాయాలను కాపాడుకుంటుండటం విశేషం.
మంచినీరు, విద్యుత్లాంటి సౌకర్యాలు లేని ప్రాంతాలు చాలా ఉన్నాయింకా. వ్యవసాయం
ప్రధాన ఆర్థిక వనరు. అయితే 1970ల్లో పెట్రోలియం, గ్యాస్, రాగి, బంగారం
నిక్షేపాలు బయటపడటంతో పపువా న్యూ గినియా ఆర్థికాభివృద్ధిలో అవి కీలకంగా
మారాయి. 1975 నుంచే భారత్ ఈ దేశంతో దౌత్యసంబంధాలను కొనసాగిస్తోంది. దాదాపు
3వేల మంది భారతీయులు ఇక్కడ పని చేస్తున్నారు. సీఏలు, ప్రొఫెసర్లు, టీచర్లు,
డాక్టర్లు, ఐటీ, ఆర్థిక నిపుణులతో పాటు చమురు ఉత్పత్తి రంగంలో అనేక మంది
ఉన్నారు.
ఎందుకీ ప్రాధాన్యం? : అమెరికాతో పోటీగా ప్రపంచంలో అన్నింటా తన ముద్ర వేయాలని
చూస్తున్న చైనా పసిఫిక్ మహాసముద్రంలోని ఈ దీవులపైనా కన్నేసింది. పపువా న్యూ
గినియాతో పాటు అనేక చిన్నచిన్న దీవి దేశాలను బుట్టలో వేసుకోవాలని చూస్తోంది.
ఆయా దేశాల్లో పెట్టుబడులు, ఆర్థిక సహకారం రూపంలో ఆకర్షిస్తోంది. తన బెల్ట్
అండ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా సొలొమన్ దీవులతో ఒప్పందం కుదుర్చుకొని
పోర్టును ఆధునికీకరించే పనులు మొదలెట్టింది. భౌగోళికంగా, వ్యూహాత్మకంగా ఈ
దీవులు పసిఫిక్లో కీలకమైనవి. అందుకే ఈ దేశాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు
చేయాలని చూస్తోంది. దీనిలో భాగంగానే పపువా న్యూ గినియా ప్రధానికి చైనా
అధ్యక్షుడు జిన్పింగ్ ఇటీవలే ప్రత్యేక ఆహ్వానం పంపించారు. చైనాకు పోటీగా
క్వాడ్ కూటమిగా ఏర్పడ్డ అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాలు దీంతో
ఉలిక్కిపడ్డాయి. ఫలితమే పపువా న్యూ గినియాతో పాటు పలు పసిఫిక్ దీవి దేశాలను
బుజ్జగించటం. జపాన్లో జీ-7 సదస్సు కాగానే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కూడా
గినియాలో పర్యటించాల్సింది. కానీ స్వదేశంలో అప్పుల సంక్షోభం నేపథ్యంలో ఆయన
అత్యవసరంగా వెళ్లాల్సి రావటంతో తన విదేశాంగ మంత్రి బ్లింకన్ను పంపించారు.
గినియాతో ఒప్పందం చేసుకోవటానికి బ్లింకన్ ప్రస్తుతం అక్కడే ఉన్నారు. తద్వారా
వ్యూహాత్మకంగా కీలకమైన ఈ దీవులు చైనా బుట్టలో పడకుండా భారత్, అమెరికా ఇతర
క్వాడ్దేశాలు జాగ్రత్తపడుతున్నాయి. ఫలితమే ఈ పర్యటనలన్నీ అలా పైకి కనిపించని
దౌత్య ఎత్తుగడలతో పసిఫిక్ దీవులకు ప్రాధాన్యం పెరుగుతోంది.