కలెక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. 21 రోజుల పాటు
నిర్వహించాల్సిన కార్యక్రమాలు, చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ల సదస్సులో
చర్చిస్తారు. పోడు పట్టాలు, ఇళ్ల స్థలాల పంపిణీ, తొమ్మిదో విడత హరితహారంపై ఈ
సమావేశంలో చర్చ జరగనుంది. అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.
నేడు కలెక్టర్లతో సీఎం వాటి గురించే ప్రత్యేక చర్చ
కొత్తగా ఏర్పాటు చేసిన బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మొదటిసారి కలెక్టర్ల సదస్సు
జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కేసీఆర్
ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నారు. సీఎం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్
కమిషనర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, అన్ని శాఖల
ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సదస్సులో
ప్రధానంగా చర్చిస్తారు. జూన్ రెండో తేదీ నుంచి 21 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా
ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు.
రోజుకు ఒక రంగం చొప్పున ఆయా రంగాల వారీగా ప్రగతి ప్రస్థానాన్ని వివరించేలా
కార్యక్రమాలు రూపొందించారు. గ్రామ స్థాయి మొదలు రాష్ట్ర రాజధాని వరకు
కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు. ఉత్సవాల
నిర్వహణకు సంబంధించి జిల్లాల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలు, చేపట్టాల్సిన
చర్యలపై.. కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. జూన్
రెండో తేదీన ప్రారంభ వేడుకలు మొదలు.. రోజుకు ఒక రంగం చొప్పున జూన్ 22వ తేదీ
వరకు కార్యక్రమాల అమలుపై మార్గనిర్దేశం చేస్తారు. అన్ని వర్గాల ప్రజలను
భాగస్వామ్యం చేస్తూ ఉత్సవాలను నిర్వహించాల్సిన తీరుతెన్నులపై వారికి
వివరిస్తారు. ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల సమన్వయం, తదితర అంశాలపై కలెక్టర్ల
సదస్సులో సీఎం చర్చిస్తారు.
జూన్ 24వ తేదీన పోడు భూముల పట్టాల పంపిణీ : పోడు పట్టాల పంపిణీపై సీఎం కేసీఆర్
చర్చించనున్నారు. దాదాపు నాలుగు లక్షల ఎకరాల వరకు పోడు భూముల పట్టాలను
పంపిణీకి సిద్ధం చేశారు. జూన్ 24వ తేదీ నుంచి పట్టాలను సీఎం కేసీఆర్ చేతులు
మీదగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. భవిష్యత్లో అటవీ ఆక్రమణలకు గురికాకుండా
పరిరక్షణలో అందరిని భాగస్వామ్యం చేయడంతోపాటు హామీ తీసుకోవాలని ప్రభుత్వం
భావిస్తోంది. సంబంధించిన అంశాలపై అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు.
గ్రామాల్లో మిగిలిపోయిన నివాసయోగ్య భూములను అర్హులైన పేదలను గుర్తించి ఇళ్ల
స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే
కొంత కసరత్తు జరిగింది. ఈ నేపథ్యంలో స్థలాలు, అర్హులైన పేదల గుర్తింపు, పట్టాల
పంపిణీపై కూడా కలెక్టర్ల సదస్సులో చర్చించి విధివిధానాలు ఖరారు చేసే అవకాశం
ఉంది.
తొమ్మిదో విడత హరితహారంపై చర్చ :తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమంపై కూడా ఈ
సమావేశంలో చర్చ జరగనుంది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 19వ తేదీన ‘‘తెలంగాణ
హరితోత్సవం’’నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు,
పట్టణాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. దీంతో ఆ
రోజుతో పాటు తొమ్మిదో విడతలో మొక్కలు నాటడం, సంరక్షణా చర్యలపై కలెక్టర్ల
సదస్సులో ఆదేశాలు జారీ చేస్తారు. వీటితోపాటు ఇతర పాలనాపరమైన అంశాలు,
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పురోగతిపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది.