న్యూ ఢిల్లీ : రష్యా నుంచి చమురు దిగుమతిపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయలేకపోతే ధరలు పెరుగుతాయని ఆయన అన్నారు. భారత్ తన అత్యున్నత జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యాపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో భారత్ ఆ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. దీనిపై ఎలాంటి నైతిక ఘర్షణ లేదని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. ఈ చమురు కొనుగోలు చేయకపోతే ధరలు పెరుగుతాయని అబుదాబిలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మేం మా వినియోగదారులకు మాత్రమే నైతిక బాధ్యత వహిస్తాం. మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. మేము ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత్ తన అత్యున్నత జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో ఎలాంటి నైతిక ఘర్షణ లేదు. మేము చమురు అందుబాటులో ఉన్న దేశాల నుంచి కొనుగోలు చేస్తాం. ప్రభుత్వం ఆ పని చేయకపోతే సంస్థలు చేస్తాయని వెల్లడించారు.భారత్‌కు చమురు ఎగుమతి చేస్తోన్న దేశాల్లో రష్యా నాలుగు లేక ఐదు స్థానాల్లో ఉంటుంది. ఈ విషయంలో గత నెల ఇరాక్ మొదటిస్థానంలో ఉంది. ఎవరూ రష్యా చమురు కొనుగోలు చేయకపోతే ధరలు పెరిగిపోతాయి. ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం ఆ తర్వాత మాంద్యం ముంచుకొస్తుంది’ అని పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు దిగుమతి తగ్గించమని అమెరికా లేక ఐరోపా యూరోపియన్ యూనియన్ భారత్‌ను కోరితే.? అని ఆ విలేకరి ప్రశ్నించగా ‘ఆ ప్రశ్నను అమెరికా లేక యూనియన్ను అడగండి’ అని కాస్త ఘాటుగా బదులిచ్చారు.