నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త
అమరావతి : నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ పచ్చజెండా ఊపారు. సుమారు 1000కి పైగా పోస్టుల భర్తీకి త్వరలో
నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు
శుభవార్త అందించింది. గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లకు ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1000 పోస్టుల భర్తీకి త్వరలో
నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. గత సంవత్సరం
సెప్టెంబర్ నెలలో 92 గ్రూప్-1 పోస్టులతోపాటు వేరే విభాగంలో ఏపీపీఎస్సీ 16
పోస్టుల భర్తీకి రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేసిన విషయం తెలిసిందే.
ఇందులో ఎనిమిది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులున్నట్లు తెలిపింది. అలాగే
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్ కింద కంప్యూటర్
డ్రాఫ్ట్స్మెన్(గ్రేడ్-2) పోస్టులు ఎనిమిది భర్తీ చేసేందుకు మరో
నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీపై సీఎం గురువారం
ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పోస్టుల భర్తీపై సీఎంకు అధికారులు
వివరాలు అందించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు
తెప్పించుకున్నామని తెలిపారు. పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని
చెప్పారు. నోటిఫికేషన్ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందన్నారు.
గ్రూప్-1కి సంబంధించి సుమారు 100కిపైగా, గ్రూప్-2కు సంబంధించి సుమారు
900కిపైగా ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. మొత్తంగా 1000కిపైగా పోస్టులు భర్తీ
చేయనున్నామని అధికారులు సీఎంకు వివరించారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి
నోటిఫికేషన్ జారీచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల
వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని సూచించారు.