ద ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ నివేదిక
న్యూఢిల్లీ : దేశీయ ఐటీ రంగంలోని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందిలో
దాదాపు 6 శాతం మంది జనవరి-మార్చి త్రైమాసికంలో ఉద్యోగాలు పోగొట్టుకున్నారని ఒక
నివేదిక తెలిపింది. ఐటీ కంపెనీలు ప్రాజెక్టులకు అనుగుణంగా, తాత్కాలికంగా
నియమించుకునే ఈ సిబ్బందిని ఫ్లెక్సీ స్టాఫ్‌గా కూడా వ్యవహరిస్తారు.
అక్టోబరు-డిసెంబరుతో పోలిస్తే, వీరి సంఖ్య మార్చి త్రైమాసికంలో తగ్గింది.
అంతర్జాతీయ మందగమనానికి తోడు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల వల్ల ఏర్పడిన
పరిస్థితులే ఇందుకు కారణమని 120 నియామక ఏజెన్సీల సంఘమైన ద ఇండియన్ స్టాఫింగ్
ఫెడరేషన్ పేర్కొంది. ఐటీ సంస్థలకు కావాల్సిన సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో
ఈ సంస్థలు సమకూరుస్తుంటాయి. ఈ 120 సంస్థల నుంచి 60,000 మంది అవుట్సోర్సింగ్
సిబ్బంది ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. వీరిలో 6 శాతానికి సమానమైన 3600
మంది మార్చి త్రైమాసికంలో ఉపాధి పోగొట్టుకున్నారని నివేదిక తెలిపింది. రాబోయే
కొన్ని త్రైమాసికాలు కూడా ఫ్లెక్సీ స్టాఫింగ్‌కు ఐటీ రంగంలో గిరాకీ తక్కువగానే
ఉంటుందనే అభిప్రాయాన్ని ఫెడరేషన్ వ్యక్తం చేసింది.
ఐటీ రంగంలో 51 లక్షల మందికి ఉపాధి: 2022 మార్చి నాటికి దేశీయ ఐటీ రంగంలో
దాదాపు 51 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. కొత్త నియామకాలను తాత్కాలికంగా నిలిపి
వేయడంతో పాటు వేలమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగిస్తున్నాయని
సంఘం తెలిపింది. తయారీ, లాజిస్టిక్స్, రిటైల్‌లో నియామకాలు: దేశీయంగా
వినియోగదారు గిరాకీ బాగున్నందున తయారీ, లాజిస్టిక్స్, రిటైల్ రంగాల్లో
నియామకాలు బలంగా కనిపిస్తున్నాయని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్
ప్రెసిడెంట్ లోహిత్ భాటియా తెలిపారు. ఇతర రంగాల్లోనూ నియామకాలు
తగ్గుతున్నాయని, 2022-23 ఆర్థిక సంవత్సరంలో వెండర్ల ద్వారా 1,77,000 ఉద్యోగాలు
మాత్రమే లభించాయని, అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 2,30,000 మంది సిబ్బందికి
కాంట్రాక్ట్ ఉద్యోగాలొచ్చాయని ఫెడరేషన్ అంటోంది. మొత్తం మీద భారత కంపెనీల్లో
వెండర్ల ద్వారా నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య 14 లక్షలకు చేరుకుంది.
ఇందులో నాలుగో వంతు మహిళలు కావడం విశేషం.
కారణాలు ఇవీ : కొవిడ్ సమయంలో ఆన్లైన్ కొనుగోళ్లు పెరగడం, ఇంటి నుంచి పని,
ఆన్లైన్ తరగతుల వంటి వాటి వల్ల ఐటీ కంపెనీలకు గిరాకీ అధికమైంది. కొవిడ్
కేసులు తగ్గిపోవడంతో సిబ్బంది అంతా కార్యాలయాలకు వస్తున్నారు. ఫలితంగా ఇంటి
నుంచి పనికి సంబంధించిన ప్రాజెక్టులు తగ్గాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం
కారణంగా ఐరోపాలో ద్రవ్యోల్బణం తీవ్రమైంది. ఇందువల్ల వినియోగదారులు అత్యవసరాల
మీదే వెచ్చిస్తున్నారు. ఫలితంగా ఐటీ కంపెనీలకు ఆర్డర్లు తగ్గాయి.