హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన దౌర్భాగ్య
పరిస్థితి రావడం అత్యంత బాధాకరమని, ఈ దీన స్థితికి మనమూ కారణమేనని మాజీ ఉప
రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ వేదికలపై,
చట్టసభల్లో అభ్యంతరకరమైన భాష వాడుకభాషగా మారడం దురదృష్టకరమన్నారు. మనం
పోలింగ్ ‘బూత్’కు వెళ్లి ‘బూతు’ మాట్లాడేవారికి ఓటుతో సమాధానం చెప్పాలని
సూచించారు. కిన్నెర ఆర్ట్ థియేటర్స్-నృత్యకిన్నెరల ఆధ్వర్యంలో జరిగిన
దివంగత ముఖ్యమంత్రి డా.ఎన్.టి.రామారావు శతజయంతి మహోత్సవాల ముగింపు
కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌లోని పొట్టి
శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ
సలహాదారు డా.కె.వి.రమణాచారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏపీ శాసనసభ మాజీ
ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌కు ‘కిన్నెర-ఎన్టీఆర్ భాషా సేవా పురస్కారం
ప్రదానం చేశారు. ఈ సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నియంతృత్వాన్ని ఎదిరించిన
ధీరోదాత్తుడు, ప్రజల మనిషి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన్ను పదవీచ్యుతుడిని
చేసి ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడవడాన్ని సహించలేకపోయానన్నారు. ఆయనకు
మద్దతుగా అప్పుడు తాను, జైపాల్‌రెడ్డి తదితరులమంతా నిలబడి ప్రజాస్వామ్య
పరిరక్షణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నామన్నారు. అప్పుడు ‘మీరు
ప్రతిపక్షంలో ఉండి కూడా నాకు చాలా సహాయం చేశారు. మీరు నా మంత్రివర్గంలో
చేరాలని ఎన్టీఆర్ ఆహ్వానించారని గుర్తు చేసుకున్నారు. సినీరంగంతోపాటు
రాజకీయాల్లోనూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. భాష విషయానికి
వస్తే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పంచాయతీ వరకు ప్రతి విషయం తెలుగులోనే
జరిగేలా చూడటం మనందరి కర్తవ్యం అనేవారన్నారు. ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు
విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గ్రంధి భవానీ ప్రసాద్, ఏపీ మాజీ ప్రధాన
కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, సాహితీవేత్త వోలేటి పార్వతీశంలు మాట్లాడారు.
మండలి బుద్ధప్రసాద్ స్పందించారు. కిన్నెర కార్యదర్శి మద్దాళి రఘురామ్
స్వాగతం పలికారు.