న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో తలపెట్టిన పారిశ్రామిక నడవాల్లో రహదారులు,
నీటిసరఫరా వ్యవస్థ, విద్యుత్తు పంపిణీ లాంటి మౌలిక వసతులను అభివృద్ధి
చేయడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు రూ.1,166 కోట్ల (141.12 మిలియన్ డాలర్ల)
రుణం మంజూరుచేసింది. ఈ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం, ఏడీబీ ఈ నెల 23న సంతకాలు
చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. విశాఖపట్నం, శ్రీకాళహస్తి-చిత్తూరు
నోడ్స్కి వివిధ దశల్లో 500 మిలియన్ డాలర్ల (రూ.4,135 కోట్లు) రుణం
ఇవ్వడానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు 2016లో ఆమోదముద్ర వేసింది. అందులో భాగంగా
ఇప్పుడు రెండోవిడత కింద రూ.1,166 కోట్ల రుణం మంజూరు పత్రాలపై సంతకాలు చేసింది.
విశాఖపట్నం నోడ్లో పారిశ్రామిక మౌలికవసతుల బలోపేతానికి ఈ రుణం పనికొస్తుందని
తెలిపింది. దీనివల్ల రాంబిల్లిలోని 160 హెక్టార్లు, నక్కపల్లి పారిశ్రామిక
నడవాలోని 441 హెక్టార్ల స్టార్టప్ ఏరియాలో అంతర్గత మౌలికవసతుల అభివృద్ధి,
అచ్యుతాపురం-అనకాపల్లి మధ్య 13.8 కిలోమీటర్ల రహదారి విస్తరణ, నక్కపల్లి నడవాకు
4.4 కిలోమీటర్ల పొడవైన యాక్సెస్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని పేర్కొంది.
శ్రీకాళహస్తి-చిత్తూరు నోడ్లో చిత్తూరు-దక్షిణ పారిశ్రామిక నడవాలోని 938
హెక్టార్ల స్టార్టప్ ఏరియా అభివృద్ధి, 9.5 కిలోమీటర్ల యాక్సెస్ రోడ్డు,
నాయుడుపేట పారిశ్రామిక నడవాకు 8.7 కిలోమీటర్ల యాక్సెస్ రోడ్డు నిర్మాణం
జరుగుతుందని ఆర్థికశాఖ తెలిపింది.