జడ్చర్ల సభలో హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ హామీ
ప్రభుత్వం లాక్కున్న భూములను పేదలు దున్నుకోండి : భట్టి
*మహబూబ్‌నగర్ : రాష్ట్రంలో యువతకు సీఎం కేసీఆర్ ఉపాధి కల్పించడం లేదని,
రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని హిమాచల్‌ప్రదేశ్ సీఎం
సుఖ్విందర్ సింగ్ సుక్కు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను
గెలిపిస్తే ఆ ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో
నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.
‘‘ఈరోజు ఇక్కడికి వస్తున్నానని తెలిసి రాహుల్ నాకు ఫోన్ చేశారు. రాష్ట్రంలో
కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని సోనియా మాటగా
చెప్పాలన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్
విధానం(ఓపీఎస్) అమల్లోకి తెస్తాం. రేవంత్‌రెడ్డి, భట్టి పోరాడుతున్నది
అధికారం కోసం కాదు.. వ్యవస్థను మార్చడానికి. అభివృద్ధి కోసం వారు
పోరాడుతున్నారు. భట్టి 800 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయడం అభినందనీయం’’ అని
సుఖ్విందర్ అన్నారు.*
ఆడబిడ్డలను మోసగించడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారు : సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని ఆడబిడ్డలను మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని పీసీసీ అధ్యక్షుడు
రేవంత్‌రెడ్డి అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల జాబితాను
తెప్పించుకున్నారన్నారు. రాష్ట్రంలో మరో 4 నెలలే ప్రభుత్వం ఉంటుందని, ఈ నాలుగు
నెలలూ ఆడబిడ్డలకు ఉచిత సిలిండర్ ఇద్దాం.. తర్వాత ముంచుదామని చూస్తున్నారని
విమర్శించారు. ఉచిత సిలిండర్లు ఇచ్చినా ప్రజలు నమ్మరన్నారు. కాంగ్రెస్
అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని
ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షలు అందిస్తామని వెల్లడించారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. రాజీవ్
ఆరోగ్యశ్రీలో భాగంగా రూ.5 లక్షలు అందిస్తామన్నారు. పాలమూరు-రంగారెడ్డి
ఎత్తిపోతల పథకాన్ని ఎవరు అడ్డుకున్నారని.. పాలమూరులో 10 లక్షల ఎకరాలను ఎడారి
చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి
మాణిక్‌రావ్ ఠాక్రే మాట్లాడుతూ భట్టి విక్రమార్క యాత్ర ముగిశాక కాంగ్రెస్
నేతలందరూ రాష్ట్రంలో బస్సు యాత్ర చేపడతామన్నారు. ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మాట్లాడుతూ కృష్ణా నది నుంచి పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర ద్వారా 11 టీంఎంసీలను
ఏపీ ప్రభుత్వం అక్రమంగా ఎత్తిపోసుకుంటుందన్నా కేసీఆర్ నోరు మెదపడం లేదన్నారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం కంటే ముందు ప్రారంభించిన
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఇప్పటికీ 40 శాతమే పూర్తయ్యాయన్నారు.
సభలో ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావెద్, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి,
సంపత్‌కుమార్, సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, మల్లు రవి,
అంజన్‌కుమార్ యాదవ్, నాగం జనార్దన్‌రెడ్డి, వీహెచ్, ఎమ్మెల్సీ
జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు
జడ్చర్ల బహిరంగ సభకు హాజరయ్యేందుకు విచ్చేసిన హిమాచల్‌ప్రదేశ్ సీఎం
సుఖ్విందర్సింగ్కు శంషాబాద్ విమానాశ్రయంలో రేవంత్‌రెడ్డి, మాణిక్‌రావ్
ఠాక్రే, ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ్యవహారాల ముఖ్య సమన్వయకర్త
కొప్పుల రాజు, రోహిత్ చౌదరి, వంశీచంద్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్,
అంజన్‌కుమార్, హర్కర వేణుగోపాల్‌లు ఘనస్వాగతం పలికారు.
సమస్యలను తెలుసుకునేందుకే పాదయాత్ర: భట్టి
నాడు కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇచ్చిన భూమిని భారాస ప్రభుత్వం లాక్కొందని
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. వచ్చే నెలలో నైరుతి రుతుపవనాలు
ప్రారంభమయ్యాక.. ప్రభుత్వం లాక్కున్న భూములను వాటిని కోల్పోయిన పేదలు అరకలు
కట్టి దున్నుకోవాలని, వారికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. తాను రాజకీయాల
కోసం పాదయాత్ర చేయటం లేదని, ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే చేస్తున్నానని
స్పష్టంచేశారు. మార్చిలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ప్రజల ఆశీస్సులతో
ప్రారంభించిన తన పాదయాత్ర ఇప్పటివరకు 805 కి.మీ. సాగిందని, దారిపొడవునా ప్రజలు
అనేక సమస్యలు తెలియజేశారన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పేదలకు 24 లక్షల
ఎకరాల భూమి ఇచ్చామన్నారు. పేదల నుంచి ఆ భూమిని భారాస ప్రభుత్వం తీసుకొని
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. పాలమూరు జిల్లా నుంచి
కృష్ణా జలాలు పోతున్నా వినియోగించుకోలేని స్థితిలో పాలకులు ఉన్నారని
మండిపడ్డారు. ఏపీ అనేక టీఎంసీలను ఎత్తిపోసుకుంటున్నా కేసీఆర్‌కు చీమ
కుట్టినట్లు కూడా లేదన్నారు. పేదలకు ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల సాయం,
రూ.500లకే గ్యాస్ సిలిండర్, రేషన్ దుకాణాల్లో 9 రకాల నిత్యావసరాలు ఇస్తామని
చెప్పారు. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల జీవన భృతి, యువతులకు స్కూటీలను పంపిణీ
చేస్తామన్నారు.