జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
గుంటూరు : రాజధాని అమరావతి ప్రాంతంలో పాము కాటుకు గురై కానిస్టేబుల్ పవన్
కుమార్ ప్రాణాలు కోల్పోవడం విచారకరమని జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం
గ్రామానికి బందోబస్తు కోసం వచ్చి పాము కాటుతో పవన్ కుమార్ ప్రాణాలు
కోల్పోయినట్లు తెలిసి చాలా బాధనిపించిందన్నారు. బందోబస్తు కోసం వచ్చిన వారు
ఆలయంలో నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. డ్యూటీలో
ఉన్నవారికి వసతులు లేమి ఉన్న విషయం ఈ సంఘటన తేటతెల్లం చేస్తోంది. బయట
ప్రాంతాలకు విధుల నిమిత్తం వెళుతున్న పోలీస్ సిబ్బందికి భోజన, వసతి సదుపాయాలు
ఎలా ఉంటున్నాయనే విషయంపై ఒక ఎస్.పి.స్థాయి అధికారి ఆధ్వర్యంలో మదింపు జరగవలసి
ఉందని, వారికి తగిన వసతులు ఏర్పాటు చేయవలసి ఉందని చెప్పారు. ప్రాణాలు
కోల్పోయిన పవన్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ ఆయన కుటుంబ
సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. పవన్ కుమార్ కుటుంబానికి తగినంత
నష్టపరిహారం తక్షణం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని పవన్ కళ్యాణ్
పేర్కొన్నారు.