టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
*జ్యోతి ప్రజ్వలన చేసి మహానాడును ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించిన
చంద్రబాబు
రాజమహేంద్రవరం : తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహానాడు
కార్యక్రమం రాజమహేంద్రవరంలో అట్టహాసంగా ప్రారంభమైంది. రాజమహేంద్రవరం మొత్తం
పసుపుమయంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ కార్యకర్తలు, శ్రేణులు
మహానాడుకు భారీగా హాజరయ్యారు. మహానాడులో భాగంగా తొలిరోజైన శనివారం ప్రతినిధుల
సభ నిర్వహిస్తున్నారు. మరో 35 వేల మంది వరకూ కార్యకర్తలు వస్తారని అంచనా.
కార్యక్రమానికి హాజరైన పార్టీ అధినేత చంద్రబాబు మొదటగా పార్టీ వ్యవస్థాపక
అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం
జ్యోతి ప్రజ్వలన చేసి మహానాడును ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ
సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ‘‘ఈసారి మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది.
ఎన్నో ‘మహానాడు’లను చూశాను. కానీ ఇంతకు ముందెప్పుడూ కనిపించని ఉత్సాహం ఇవాళ
చూస్తున్నాను. ఎన్టీఆర్ శత జయంతిని ప్రపంచమంతా నిర్వహించుకుంటున్నాం.
ప్రపంచవ్యాప్తంగా 100 ప్రదేశాల్లో ఏ నాయకుడికి జరగనంత గొప్పగా శతజయంతిని
చేశాం. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్ శకం ప్రారంభమవుతుంది. తెలుగుజాతి
ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన వారసత్వాన్ని భావితరాలకు
అందించాల్సి ఉందని చంద్రబాబు అన్నారు.