రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
నెల్లూరు : రాష్ట్రంలో రూ. 16వేల కోట్లతో నాలుగు పోర్టుల నిర్మాణ పనులు
చేపట్టినట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం
చేశారు. సోమవారం గుడ్లూరు మండల పరిధిలోని రామాయపట్నం పోర్టులో అభివృద్ధి
పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కందుకూరు
శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి, కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్
కుమార్ రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు.
తొలుత రామాయపట్నం పోర్టుకు విచ్చేసిన మంత్రికి జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్,
కందుకూరు సబ్ కలెక్టర్ శోభిక, రామాయపట్నం పోర్టు మేనేజింగ్ డైరెక్టర్ ప్రతాప్
రెడ్డి, పోర్టు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రులకు పవర్
పాయింట్ ప్రజెంటేషన్, చిత్రపటం ద్వారా పోర్టు అభివృద్ధి పనుల పురోగతిని
అధికారులు వివరించారు.
తదుపరి పోర్ట్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రులు పరిశీలించారు. ఈ
సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో 974
కిలోమీటర్ల సువిశాల సముద్ర తీర ప్రాంతంలో సహజ వనరులను సద్వినియోగం
చేసుకునేందుకు ఎపి మారిటైం బోర్డు ను ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో
ఆరుపోర్టులు ఉండగా నూతనంగా కాకినాడ, రామాయపట్నం, శ్రీకాకుళం జిల్లా మూలపేట,
మచిలీపట్నం జిల్లా బందరు పోర్టుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి శ్రీకారం
చుట్టారన్నారు. రూ. 16 వేల కోట్లతో పోర్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.
రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు గత ఏడాది ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని, రూ.
2600 కోట్లతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2024 జనవరిలోగా రామాయపట్నం
పోర్టు మొదటి దశ నిర్మాణ పనులను పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి
చెప్పారు. అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కి సంబంధించి గ్రామస్తులు
కల్పించాల్సిన మౌలిక వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించామని, అన్ని సమస్యలను
త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ పోర్టు
ఏర్పాటుతో ఈ ప్రాంతం ముఖచిత్రం మారబోతోందని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు
లభిస్తాయని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర
అభివృద్ధికి ఒక ప్రణాళిక ఉండాలని భావించిన ముఖ్యమంత్రి ఆ దిశగా పోర్టుల
అభివృద్ధికి చర్యలు చేపట్టారన్నారు. రామాయపట్నం పోర్టు అభివృద్ధి పనులు,
పునరావాస కార్యక్రమాలపై సమీక్షించామని, అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి
చేస్తామన్నారు. నెల్లూరు జిల్లా అభివృద్ధిలో దివంగత ముఖ్యమంత్రి వైయస్
రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చెరగని ముద్ర
వేశారని చెప్పారు. కృష్ణపట్నం పోర్టు, అనుబంధ పరిశ్రమలు, సంగం, పెన్నా
బ్యారేజీలు, జెన్కో, సెంబ్ కార్ప్ థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటు వంటి అనేక
అభివృద్ధి పనులు జిల్లాలో పూర్తి చేసిన ఘనత వీరికే దక్కుతుందన్నారు.
అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తూ సమగ్రంగా, సంపూర్ణంగా ఆంధ్ర రాష్ట్ర
సర్వతోముఖాభివృద్దికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా
చెప్పారు. ఈ పర్యటనలో రామాయపట్నం పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి ప్రతాప్
రెడ్డి, జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ
కలెక్టర్ పద్మావతి, ఏపీ మారిటైం బోర్డు చీఫ్ ఇంజనీర్ రాజగోపాల్, గుడ్లూరు,
ఉలవపాడు మండలాల తహసిల్దార్లు సూర్యనారాయణ సింగ్, బ్రహ్మయ్య, పోర్టు అధికారులు
పాల్గొన్నారు.