హైదరాబాద్ : గత 22 ఏళ్లుగా ప్రజల కోసమే బీఆర్ఎస్ పనిచేస్తోందని ఎమ్మెల్సీ
కల్వకుంట్ల కవిత అన్నారు. అనేక మంది కార్యకర్తలు పార్టీ కోసం జీవితాలను త్యాగం
చేశారని కొనియాడారు. కర్ణాటక ఎన్నికలతో బీజేపీ పనైపోయిందని మంత్రి మల్లారెడ్డి
అన్నారు. మక్లూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి
మల్లారెడ్డితో కలిసి కవిత పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ తమ వ్యూహాలకు ఇప్పటి
నుంచే పదునుపెట్టింది. ఈ క్రమంలో గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను
నెరవేర్చుతూ ముందుకు సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇప్పటికే సచివాలయంలో
వరుస సమీక్షలతో బిజీబిజీగా గడుపుతున్నారు. మరో వైపు మంత్రులు, అధికారులకు
ప్రజాసమస్యలు, సంక్షేమ పథకాలు అందే విషయంలో దృష్టిసారించాలని దిశా నిర్దేశం
చేశారు. మంత్రులు ఆయా శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఒకవైపు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూనే,
మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. అలాగే నిర్మాణం
పూర్తి చేసుకున్న పలు అభివృద్ధి పనులను నాయకులు ప్రారంభిస్తున్నారు.ఈ క్రమంలో
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మామిడిపల్లి వద్ద మండల స్థాయి బీఆర్ఎస్
ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి మల్లారెడ్డితో
కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక
వ్యాఖ్యలు చేశారు.
ఒకప్పుడు గులాబీ కండువా కప్పుకుంటే ఎగతాళి చేసేవారని, కానీ ఇప్పుడు గులాబీ
కండువా కప్పుకున్నందుకు గర్వపడుతున్నామని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల
కవిత అన్నారు. గత 22 ఏళ్లుగా ప్రజల కోసమే బీఆర్ఎస్ పనిచేస్తోందన్న కవిత అనేక
మంది కార్యకర్తలు పార్టీ కోసం జీవితాలను త్యాగం చేశారని కొనియాడారు.
కార్యకర్తల త్యాగఫలమే కాళేశ్వరం జలాలు అని కవిత పేర్కొన్నారు. కష్టపడ్డ వారికి
పదవులు వస్తాయని, రాని వారు నిరాశ చెందవద్దని ఎమ్మెల్సీ కవిత సూచించారు.
’22 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రజల కోసం పనిచేస్తోంది. అనేక మంది కార్యకర్తలు పార్టీ
కోసం జీవితాలను త్యాగం చేశారు. ఒకప్పుడు గులాబీ కండువా కప్పుకుంటే ఎగతాళి
చేశారు. ఇప్పుడు గులాబీ కండువా కప్పుకున్నందుకు గర్వపడుతున్నాం. కార్యకర్తల
త్యాగఫలమే కాళేశ్వరం జలాలు అని కవిత పేర్కొన్నారు.