సీఐడీ దర్యాప్తు అటాచ్ చేసేందుకు అనుమతి ఇచ్చిన హోం శాఖ
ఏసీబీ కోర్టులో దరఖాస్తు చేసిన సీఐడీ
అమరావతి : రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చడం వెనుక
అవినీతి ఉందని ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ
నేపథ్యంలో చంద్రబాబు ఉంటున్న కరకట్ట నివాసం అటాచ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటే
సీఐడీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టు అనుమతి కోరారు. ఆ మేరకు దరఖాస్తు
దాఖలు చేశారు. ప్రభుత్వం తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద
వాదనలు వినిపించారు. అటాచ్ మెంట్ ఉత్తర్వులకు ముందు ప్రతివాదులకు నోటీసులు
ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అనంతరం, తదుపరి విచారణను నేటికి వాయిదా
వేస్తున్నట్టు ఏసీబీ కోర్టు తెలిపింది. చట్ట నిబంధనలు పరిశీలించాల్సి ఉందని,
మిగతా వాదనలు కూడా వినాల్సి ఉందని అభిప్రాయపడింది. చంద్రబాబు కరకట్ట
నివాసాన్ని, ఇదే ప్రాంతంలోని మాజీ మంత్రి నారాయణ ఆస్తులను అటాచ్ చేసేందుకు
సీఐడీకి అనుమతి ఇస్తూ హోం మంత్రిత్వ శాఖ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేయడం
తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం లింగమనేని రమేశ్ ది.
అయితే, రాజధాని మాస్టర్ ప్లాన్ ద్వారా లింగమనేని, తదితరులు భూములు, ఆస్తుల
విలువ పెరగడానికి చంద్రబాబు దోహదపడ్డారని, అందులో క్విడ్ ప్రో కో రీతిలో
చంద్రబాబుకు లింగమనేని తన భవనాన్ని ఉచితంగా ఇచ్చారని ప్రభుత్వం ఆరోపిస్తోంది.
సీఐడీ ఆ మేరకు దర్యాప్తు జరుపుతోంది.