హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్న రోజుల్లో చురుగ్గా పనిచేసి బీజేపీని బలోపేతం చేస్తామని, ఆ దిశాగా సాగేందుకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గైడెన్స్ తీసుకున్నామని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులపై సోము వీర్రాజు, ఆర్ఆర్ఎస్ నేత మధుకర్‌లు కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆర్ఆర్ఎస్ నేత మధుకర్‌లు భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కార్యాలయానికి సోము వీర్రాజు, ఆర్ఆర్ఎస్ నేత మధుకర్ చేరుకుని రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగతంగా బలోపేతం, చేరికల వంటి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. భేటీ అనంతరం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)అధిష్టానం ఎక్కడ పని చేయమంటే అక్కడే పని చేస్తానని వ్యాఖ్యానించారు. తనకున్న అంతో ఇంతో అనుభవంతో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆర్ఆర్ఎస్ నేత మధుకర్‌తో జరిగిన భేటీలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించామన్నారు.