13 రాష్ట్రాలలో ఇతర పార్టీల అధికారం
తగ్గుతున్న బిజెపి ప్రాభవం
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో బిజెపిలో టెన్షన్
పెరిగిపోతోంది. ఆ పార్టీకి లోక్‌సభలో స్పష్టమైన ఆధిక్యం ఉన్న మాట వాస్తవమే
అయినప్పటికీ దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుల
విషయానికి వచ్చేటప్పటికి ఆ సంఖ్య తక్కువగానే ఉంది. ఈ చేదునిజమే బిజెపిని
కలవరపెడుతోంది. దేశంలో ప్రస్తుతం బిజెపి, కాంగ్రెస్ పార్టీలే అతి పెద్ద జాతీయ
పార్టీలు. అయితే ఈ రెండు పార్టీలకూ ఉన్న ఎమ్మెల్యేల కంటే ఇతర పార్టీలకు ఉన్న
ఎమ్మెల్యేల సంఖ్యే అధికంగా ఉంది. ఇటీవల వివిధ రాష్ట్రాల శాసనసభలకు జరిగిన
ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే బిజెపి, కాంగ్రెస్‌లతో పోలిస్తే ప్రాంతీయ
పార్టీల తరఫునే ఎక్కువ మంది శాసనసభ్యులు గెలుపొందారు. ఈ పార్టీలకు
ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 1600 పైమాటే. ఈ సంఖ్యతో పోలిస్తే
జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్, అమ్ఆద్మీ పార్టీలు చాలా వెనుకబడి
ఉన్నాయి.
గత ఐదు సంవత్సరాలలో వివిధ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి బలం
బాగా పడిపోయింది. ఆ పార్టీ 1312 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్
తరఫున 770 మంది గెలుపొందారు. వామపక్షాలకు 116, బిఎస్పికి 15, ఆప్‌కు 161
అసెంబ్లీ స్థానాలు లభించగా ప్రాంతీయ పార్టీలు, ఇతరులు 1679 స్థానాలు
గెలుచుకున్నారు. దేశంలోని 13 రాష్ట్రాలలో బిజెపి, కాంగ్రెస్ పార్టీల కంటే ఇతర
పార్టీలకు చెందిన వారే ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అంటే 13
రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం అధికంగా ఉందన్న మాట. జనాభా ప్రాతిపదికన
చూస్తే ఈ పార్టీలు యాభై కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీహార్,
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిసా, తెలంగాణ,
జార్ఖండ్, మేఘాలయ, నాగాలండ్, పుదుచ్చేరి, మిజోరం, సిక్కిం రాష్ట్రాలు
ప్రాంతీయ పార్టీల పాలనలో ఉన్నాయి. ఇటీవలే జాతీయ పార్టీ హోదా పొందిన అమ్ఆద్మీ
పార్టీ రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉంది. ఈ పార్టీకి పంజాబ్‌లో 92 మంది
ఎమ్మెల్యేలు, ఢిల్లీలో 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కేరళలో అధికారంలో ఉన్న
ఎల్డీఎఫ్కు 97 మంది శాసనసభ్యులు ఉన్నారు.
దేశ జనాభా ప్రాతిపదికన పరిశీలిస్తే బిజెపి 48.8 కోట్ల మందికి, కాంగ్రెస్ 24.4
కోట్ల మందికి, ప్రాంతీయ పార్టీలు 55.4 కోట్ల మందికి ప్రాతినిధ్యం
వహిస్తున్నాయి. బిఎస్పికి 0.6 కోట్ల మందికి, అమ్ఆద్మీ పార్టీ 4.5 కోట్ల
మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. బిజెపి ఏడు రాష్ట్రాలలో అధికారంలో ఉంది. ఈ
రాష్ట్రాల శాసనసభ్యులలో బిజెపికి సగం లేదా అంతకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు
ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌కు నాలుగు రాష్ట్రాలలో సగం కంటే ఎక్కువ మంది
ఎమ్మెల్యేలు ఉన్నారు. తొమ్మిది రాష్ట్రాలలో ఇతర పార్టీల ప్రభుత్వాలు అధికారంలో
కొనసాగుతున్నాయి. ఈ రాష్ట్రాలలో ఆయా పార్టీలకు 80 శాతం కంటే ఎక్కువగానే
ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ విషయాలన్నీ పరిశీలిస్తే బిజెపి కంటే ప్రాంతీయ పార్టీలే
బలంగా ఉన్నట్లు విదితమవుతోంది.