పోతిన మహేష్ వ్యవహారాన్ని పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్తా
పోతిన మహేష్ తీరుపై మండిపడ్డ గయాజుద్దీన్
విజయవాడ : జనసేన పార్టీ కార్యక్రమాలను 40వ డివిజన్ జనసేన అధ్యక్షుడినైన తనకు
తెలియకుండా జనసేన నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ చేయడం సరైనది కాదని 40వ
డివిజన్ జనసేన అధ్యక్షుడు షేక్ గయాజుద్దీన్(ఐజా) విమర్శించారు. గురువారం
ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొన్ని నెలల నుంచి
పోతిన మహేష్ 40వ డివిజన్లో తనకు తెలియజేయకుండా జనసేన పార్టీ తరఫున
కార్యక్రమాలు చేస్తున్నారని, ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తూ పార్టీని ప్రజలకు
దూరం చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. నేడు కూడా జనసేన ఫ్లెక్సీ ఏర్పాటు
విషయంలో తనకు విషయాన్ని తెలియ చేయకుండా మహేష్, ఆయన అనుచరులు వ్యవహరించడం
దారుణమని ఆయన విమర్శించారు. తన పట్ల తీవ్ర వ్యతిరేకతతో వ్యవహరిస్తున్న పోతిన
మహేష్ వ్యవహారాన్ని పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని గయాజుద్దీన్
చెప్పారు. గతంలో కూడా పార్టీ సభ్యత నమోదు విషయంలో కూడా మహేష్ ఇలానే ఒంటెద్దు
పోకడతో వ్యవహరించారని విమర్శించారు. తనకు సమాచారం ఇవ్వకుండా తన అనుచరులతో ఈ
డివిజన్లో కార్యక్రమాలను నిర్వహించడం ఏమాత్రం సరికాదని గయాజుద్దీన్ ఘాటుగా
విమర్శించారు. ఇటువంటి వ్యవహారాలకు మహేష్ స్వస్తి పలకాలని ఆయన డిమాండ్ చేశారు.
తన పట్ల మహేష్ వ్యవహరిస్తున్న వైఖరిని పార్టీ అధినాయకుల దృష్టికి గతంలోనే
తీసుకెళ్లడం జరిగిందని ఆయన చెప్పారు. మళ్ళీ కొంతకాలం తర్వాత ఇటువంటి చర్యలకు
పోతున్న మహేష్ పాల్పడడం సమంజసంగా లేదని, ఈ విషయాన్ని సైతం పార్టీ అధినాయకత్వం
దృష్టికి తీసుకెళ్తామని గయాజుద్దీన్ చెప్పారు.