హైదరాబాద్ : తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని పదో ఏట అడుగుపెడుతున్న వేళ
రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటాయి. ఆయా జిల్లాల్లో
నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు
పాల్గొన్నారు. కలెక్టరేట్లలో జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్రం ఏర్పడిన నాటి
నుంచి నేటి వరకు జరిగిన అభివృద్ధిని వివరించారు.
హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని
జిల్లాల కలెక్టరేట్లలో జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు
పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన వేడుకల్లో
వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొనగా సిరిసిల్లలో జరిగిన ఉత్సవాల్లో
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం
సిద్ధించిన నాటి నుంచి నేటి వరకు ఈ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని
వివరించారు. ఈ సందర్భంగా రానే రాదన్న తెలంగాణను సాధించి, కానే కాదన్న
అభివృద్ధిని చేసి చూపెట్టింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి హరీశ్‌రావు
కొనియాడారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించి అనతి కాలంలోనే తెలంగాణను
ఎవరెస్టు శిఖరమంత ఎత్తున నిలిపారని పేర్కొన్నారు. ఈ 9 ఏళ్లలో రాష్ట్రాన్ని
అభివృద్ధికి రోల్ మోడల్ గా చేసి, 76 ఏళ్ల స్వతంత్ర భారత్‌కు మార్గదర్శిగా
మార్చింది మన సీఎం అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ అమలు చేసిన
పథకాలు, కార్యక్రమాలు, నిర్ణయాలు ప్రజల జీవితాల్లో వెలుగు నింపాయన్న
హరీశ్‌రావు.. తెలంగాణ ఆచరిస్తే, నేడు దేశం అనుసరిస్తుంది తెలిపారు. అందుకే
‘తెలంగాణ మాడల్’ దేశమంతటా ఆకర్షించేలా విరాజిల్లుతుందని వివరించారు.
అవమానాలు, అన్యాయాలకు గురైన చోటే స్వరాష్ట్రంలో సమగ్రాభివృద్ధి చెంది..
సగర్వంగా దశాబ్ది సంబురం చేసుకొంటున్న చారిత్రక సందర్భం ఇది అని మంత్రి
ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.