ఒడిశాలో మాటలకందని మహా విషాదం జరిగింది. బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం అనూహ్య
రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 233 మంది దుర్మరణం పాలయ్యారు. 900
మందికిపైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని
అధికార వర్గాలు తెలిపాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు
కనిపిస్తున్నాయి. ఒడిశాలో రైలుపట్టాలపై మరణ మృదంగం మోగింది. రెండు సూపర్
ఫాస్ట్ రైళ్లు, ఓ గూడ్స్ రైలు ఢీకొనటం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘోర
రైలు ప్రమాదంలో 233 మంది దుర్మరణం పాలయ్యారు. 900 మందికిపైగా గాయాలపాలయ్యారు.
బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాకు వెళ్తున్న బెంగళూరు-హావ్‌డా
సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగాబజార్ వద్ద
శుక్రవారం రాత్రి 7గంటల సమయంలో పట్టాలు తప్పింది. పలు బోగీలు పక్కనున్న
ట్రాక్‌పై పడ్డాయి. వాటిని షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్
ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన
15బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదం అక్కడితోనే ఆగలేదు. బోల్తాపడ్డ కోరమండల్
కోచ్‌లను పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై నుంచి దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది.
3రైళ్లు ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. కోరమండల్ ఎక్స్‌ప్రెస్
కోల్‌కతా నుంచి చెన్నైకి వెళ్తోంది. అయితే రాత్రివేళకావడం వల్ల సహాయకచర్యలకు
ఆటంకంగా మారినట్లు తెలుస్తోంది. అయితే రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ
కథనం మాత్రం మరోలా ఉంది. తొలుత కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిందని
చెప్పారు. 10 నుంచి 12 బోగీలు బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్ రైలు మార్గంలో
పడ్డాయని పేర్కొన్నారు. అనంతరం ఆ సూపర్‌ఫాస్ట్ బోగీలు పక్క ట్రాక్‌పై బోల్తా
పడ్డాయని అమితాబ్ వివరించారు. రాత్రివేళ ప్రమాదం జరగటంతో.. బోల్తాపడిన
బోగీల్లో ఇంకా ఎంతమంది చిక్కుకొని ఉండొచ్చనేది అధికారులు అంచనాకు
రాలేకపోతున్నారు. బాధితుల్లో బంగాల్వాసులే ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది.
రైలు ప్రమాదం అనంతరం బోగీల్లో చిక్కుకున్నవారి హాహాకారాలతో ఘటనాస్థలం
దద్దరిల్లింది. ఈ దుర్ఘటన సమాచారం తెలిసిన వెంటనే అధికారవర్గాలు
అప్రమత్తమయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకొని సహాయకచర్యలు ప్రారంభించాయి.