గుంటూరు : శుక్రవారం రాత్రి ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ సమీపంలో చోటు చేసుకున్న
ఘోర రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసిందని
జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 278మంది ప్రయాణీకులు ఈ
దుర్ఘటనలో మృత్యువాత పడటం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ
సానుభూతి తెలియచేస్తున్నానని, ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్,
బెంగళూరు – హౌరా సూపర్ ఫాస్ట్ రైళ్లలో తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు ఎక్కువగా
ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర
ప్రభుత్వాలు బాధిత ప్రయాణీకులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు తగిన
ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో రైలు ప్రమాద ఘటనల నివారణకు
సంబంధించిన భద్రత చర్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ దృష్టి పెట్టాలని పవన్
కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.