ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం : ఒడిశా లో జరిగిన రైలు ప్రమాద బాధితులకు పూర్తి సహాయ, సహకారాలు
అందించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ
మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం విశాఖ జిల్లా కలెక్టరేట్లో
రైలు ప్రమాద సంఘటనపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరు వెంకట
నాగేశ్వరరావు, హౌసింగ్ మినిస్టర్ జోగి రమేష్ , జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ
మల్లికార్జున, పోలీసు కమిషనర్ త్రివిక్రమ్ వర్మ లతో కలిసి పత్రికా విలేకరులతో
సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ
ముఖ్యమంత్రి నేతృత్వంలో విజయవాడ లో అధికారులతో సమీక్ష నిర్వహించారని తెలిపారు.
ఈ సంఘటనలో ఎవరైతే మన రాష్ట్రానికి సంబంధించి క్షతగాత్రులు , చనిపోయిన వారు ,
ప్రమాదానికి గురి అయిన వారు గాని, అక్కడ ఉన్న వారిని గాని సురక్షితంగా
తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం
అందించేందుకు, చనిపోయిన వారిని వారి బంధువులకు అప్పగించుటకు పూర్తి చర్యలు
తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి
ఆదేశంతో ఇప్పటికే రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ముగ్గురు
ఐఏఎస్ అధికారుల బృందం ఒడిశా లోని రైలు ప్రమాద స్థలం చేరుకున్నట్లు
తెలిపారు.
ఈ రైలు ప్రమాదంలో 12841 షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ ప్రెస్
డౌన్లైన్లో ప్రయాణిస్తున్న 12864 బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్
ప్రమాదానికి గురి అయినట్లు తెలిపారు. కోరమండల్ ఎక్స్ప్రెస్ లో ఆంధ్రప్రదేశ్
లో దిగవలసిన వారు 482 మంది ఉన్నారని , వీరిలో విశాఖలో 309 మంది దిగవలసి ఉందని
, కానీ 165 మంది సురక్షితంగా ఉన్నారని అన్నారు. 11 మంది గాయపడ్డారని , 57 మంది
ప్రయాణం చేయలేదని , 76 మంది జాడ ఇంకా తెలియవలసి ఉందని తెలిపారు .అదేవిదంగా
రాజమండ్రి లో దిగవలసిన 31 మందిలో 22 మంది సురక్షితంగా ఉన్నారని, 9 మంది
గుర్తింపు తెలియాల్సి ఉందన్నారు. విజయవాడలో 137 మంది దిగవలసి ఉండగా , 80 మంది
సురక్షితంగా ఉన్నారని, 7 గురు గాయపడ్డారని అన్నారు. 22 మంది ప్రయాణం చేయలేదని
28 మంది ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని పేర్కొన్నారు. యస్వంతపూర్ రైలులో 89 మంది
ఆంధ్రప్రదేశ్ లో దిగవలసిన వారు వున్నారని వివరించారు. రేపు ఉదయానికి పూర్తి
సమాచారం అందుతుందని తెలిపారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు
రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితులను గమ్యస్థానాలకు చేర్చటానికి
చర్యలు తీసుకుంటున్నారన్నారు. విశాఖపట్నం, విజయనగరం , శ్రీకాకుళం , రాజమండ్రి,
ఏలూరు , విజయవాడ జిల్లాల కలెక్టర్ల కార్యాలయాలలో ప్రత్యేక కంట్రోల్ రూమ్
లను ఏర్పాటు చేసి బాధితుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం
అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇచ్చాపురం నుంచి ఒంగోలు వరకు ఉన్న అన్ని
ప్రభుత్వాసుపత్రులను అలర్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి
ఒడిస్సా రైలు సంఘటన స్థలానికి 108 వాహనాలు 25 , ప్రైవేట్ అంబులెన్స్ లు 25
మొత్తం 50 , అదేవిధంగా 15 మహాప్రస్థానం వాహనాలను పంపినట్లు పేర్కొన్నారు. నేవీ
, ఎయిర్ఫోర్స్ సహాయం కూడా తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్
నుంచి ఎవరు చనిపోయినట్లు సమాచారం లేదని అన్నారు.
సంఘటన జరిగినప్పటినుండి ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ టైమ్ టు టైమ్
అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ భువనేశ్వర్ లో రెండు
ఆసుపత్రులను గుర్తించి అక్కడే క్షతగాత్రులకు ట్రీట్మెంట్ కు చర్యలు
చేపట్టామన్నారు. కటక్, భువనేశ్వర్ లో రెండు చోట్ల రెండు మెడికల్ టీములను
ఏర్పాటు చేశామని వివరించారు. సంఘటన స్థలం నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన
వారికి ప్రత్యేక ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినందున ప్రయాణికుల బంధువులు వాట్సాప్
ద్వారా ప్రయాణికుల ఫోటోలు, వివరాలు తెలియజేయాలని అన్నారు. ప్రమాద బాధితులకు
ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా
అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.