వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
విజయవాడ : ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం పై తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో పాటు ముగ్గురు ఐఏఎస్
అధికారులను సంఘటనా స్థలాన్ని సందర్శించాలని ఆదేశాలు జారీచేసినట్లు రాజ్యసభ
సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కి చెందిన ప్రయాణీకులకు సంబందించి అన్ని రకాల సహాయ సహకారాలు
అందించాలని ఆదేశించారని చెప్పారు. అలాగే ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో
అంబులెన్స్ వాహనాలు సిద్ధం చేశారని, సమాచారం, సహాయం కొరకు హెల్ప్ డెస్క్ లను
ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా శనివారం ఆయన
పలు అంశాలు వెల్లడించారు.
కల్తీ విత్తన విక్రయదార్లపై కఠిన చర్యలు తీసుకోవాలి
రైతులకు కల్తీ విత్తనాలు విక్రయించి మోసాలకు పాల్పడుతున్న వారిని
నిరోధించాలని అటువంటి వారిపై కఠిన చర్యలు చేపట్టాలని జైలుకు పంపాలని విజయసాయి
రెడ్డి కోరారు. ఈ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రజలను
చైతన్యం చేయాలని విజయసాయి రెడ్డి కోరారు. రైతులు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా
ఉండాలని, అనధికార విక్రయదార్లు, నాసిరకం విక్రయాల విషయంలో జాగరూకతతో ఉండాలని
సూచించారు. వర్షాకాలం సమీపిస్తోందని, వర్షాలు పడిన వెంటనే రైతులు దుక్కి
దున్ని విత్తనాలు నాటుతారని అన్నారు.
కాశీ క్షేత్ర కారిడార్ ను అద్భుతంగా తీర్చిదిద్దడంలో ప్రధాని కృషి ప్రశంసనీయం
ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ కారిడార్ ను అధ్బుతంగా తీర్చిదిద్దడంలో ప్రధాని
మోదీ కృషి ప్రశంసనీయమని విజయసాయి రెడ్డి అన్నారు. శనివారం కాశీ క్షేత్ర దర్శనం
అనంతరం తన అనుభూతిని ట్విట్టర్ వేదికగా ఆయన ప్రజలతో పంచుకున్నారు.
విమాన టికెట్ ధరలు పెరగకుండా చర్యలు చేపట్టాలి
గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ ప్రారంభంతో విమాన టికెట్ ధరలు పెరిగాయని, తద్వారా
ప్రయాణీకులు 20-30 శాతం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని విజయసాయి రెడ్డి
అన్నారు. అయితే దీనిని అదునుగా చేసుకొని ప్రస్థుతం ఉన్న ఏ ఇతర విమానయాన సంస్థ
తప్పుతోవలో లాభపడకుండా కేంద్ర విమానయాన శాఖ మంత్రి జేఎం సింధియా చర్యలు
తీసుకోవాలని ఆయన కోరారు.