దుర్ఘటన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టాం
ఏపీ ప్రయాణికులకు అన్ని విధాలా సాయం
వీరి కోసం ప్రత్యేక చర్యలు
ముఖ్యమంత్రి జగనన్న ఆదేశాల మేరకు అంబులెన్సులు, మహాప్రస్తానం వాహనాల
తరలింపు
సరిహద్దు ప్రాంత వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణంలోని ఆస్పత్రుల సిబ్బందికి తగిన
ఏర్పాట్లకై ఆదేశాలు జారీ
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని
గుంటూరు : ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లాలో రైళ్లు ఢీకొన్న దుర్ఘటన
అత్యంత బాధాకరమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆవేదన
వ్యక్తంచేశారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలు, రాష్ట్రానికి
చెందిన ప్రయాణికులకు అండగా ఉండటం కోసం తీసుకుంటున్న చర్యలపై శనివారం
ఆమె మాట్లాడారు. రైలు ప్రమాద ఘటన కలిచివేసిందని చెప్పారు. 270మందికిపైగా
ప్రాణాలను కోల్పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల
కుటుంబాలకు అండగా ఉండటంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
చేయాల్సిందంతా చేస్తున్నారని తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆయన
పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం సహాయక చర్యల్లో
ముమ్మరంగా పాలుపంచుకుంటున్నదని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి
వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని
ప్రార్థిస్తున్నామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని
అధికారులకు ఆదేశాలు జారీచేశామని తెలిపారు. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలకు
ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక బృందాలు వెళ్లాయని చెప్పారు. మన రాష్ట్రానికి
చెందిన ప్రయాణికులందరికీ ఏ సమస్యా రాకూడదని జగనన్న ఆదేశాలు
జారీచేశారని తెలిపారు. ఆ మేరకు అందరి వివరాలను అధికారులు
సేకరిస్తున్నారని చెప్పారు. హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటుచేశామని, కలెక్టర్లు
నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ నంబర్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
20 అంబులెన్సులు పంపాం
ఘటనా ప్రాంతానికి రెండు విడతలుగా మన రాష్ట్రం నుంచి అడ్వాన్స్‌డు లైఫ్
సేవింగ్ అంబులెన్సులు 20 పంపామని చెప్పారు. 21 మహాప్రస్తానం వాహనాలను
కూడా పంపామని తెలిపారు. ఇంకా అవసరమైతే మరిన్ని వాహనాలను పంపేందుకు కూడా
సిద్ధంగా ఉన్నామని పేర్కన్నారు. ఈ వాహనాలను సమన్వయం చేసుకునేందుకు
వైద్యం, రవాణా, పోలీసు శాఖల నుంచి ప్రత్యేకంగా ముగ్గురు అధికారులను ఒక
కమిటీలాగా నియమించామని చెప్పారు. శ్రీకాకుళం రిమ్స్, విశాఖపట్టణం
కేజీహెచ్, విజయనగరం జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్లను అప్రమత్తం
చేశామని చెప్పారు. గాయపడిన వారికి తగిన చికిత్స అందించేందుకు వీలుగా అన్ని
ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అవసరమైతే ఘటనా స్థలానికే వెళ్లి చికిత్స
అందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఒడిశా
సరిహద్దులోని మన ఆస్పత్రుల సిబ్బంది మొత్తానికి తగిన అదేశాలు
జారీచేశామని, అవసరమైతే ఒడిశాలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న
సిబ్బందికి వైద్య సేవలు అందించాలని చెప్పామని తెలిపారు. బాధితులకు
పూర్తిస్థాయిలో అండగా ఉండాలని సీఎం జగనన్న ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు
చేసినట్లు చెప్పారు.