వాషింగ్టన్: ప్రస్తుతం భారత్ రెండు విభిన్న సిద్ధాంతాలపై పోరాటాన్ని
చూస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అధికార బీజేపీకి
వ్యతిరేకంగా ‘ప్రత్యేక దృక్పథం’ కోసం దేశంలోని ప్రతిపక్ష పార్టీలు
ఏకమవుతాయన్న ధీమా వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్
వాషింగ్టన్లో ప్రవాస భారతీయులు, భారత సంతతి ప్రజలతో ఏర్పాటుచేసిన సమావేశంలో
మాట్లాడారు. తాను కాంగ్రెస్సేతర ప్రతిపక్ష పార్టీలను కలిసిన ప్రతిసారి ‘మనం
ఐక్యంగా పోరాడాలి’ అన్న విషయాన్ని నొక్కివక్కాణించే వాడినని పేర్కొన్నారు.
చాలా మంది మీడియా వ్యక్తులు బీజేపీ , ఆరెస్సెస్‌లను వాటి బలాన్ని పెద్దగా
చూపాలని ఇష్టపడుతున్నారు. దయచేసి హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలను చూడండి. కర్ణాటక
ఎన్నికలను చూడండి. త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ల
ఎన్నికలను గమనించండి. బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఎక్కువని
మీరు తెలుసుకుంటారని పేర్కొన్నారు.
దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య పోరు కొనసాగుతోంది. ఒకటేమో శాంతి, అహింస, సత్యం,
నిరాడంబరతలతో కూడిన మహాత్మా గాంధీ దృక్పథం. కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా
ప్రజలంతా దేశ పురోగతిలో సమాన భాగస్థులు అనే దృక్పథం అని చెప్పారు. అదే సమయంలో
విభజన దురహంకారం, శాస్త్రీయతలేని దుందుడుకుతనంతో ఆర్ఎస్ఎస్ ద్వారా పోరాడే
దృక్పథం మరొకటి. ఈ రెండు సిద్ధాంతాలు ఒకదానితో మరొకటి పోరాడుతున్నాయి.
హింసాత్మకంగా, విద్వేషపూరితంగా ఉండడం మన లక్షణం కాదు. గాంధీ దృక్పథం త్వరలోనే
విజయం సాధిస్తుందన్న విశ్వాసం ఉందని వెల్లడించారు.